జనం న్యూస్ జనవరి 10 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్‌పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కూకట్‌పల్లి 1988–89 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఉదయం ఘనంగా జరిగింది. 37 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకున్న సహపాఠుల ఆనందం, చిన్ననాటి జ్ఞాపకాల తీపి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఉపాధ్యాయులు వెంకట్‌రెడ్డి మరియు విజయలక్ష్మి టీచర్ హాజరై పూర్వ విద్యార్థులతో మమేకమయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో కాలం గడిచినా మరచిపోలేని తమ ఉపాధ్యాయులు, తోటి స్నేహితుల జ్ఞాపకార్థం రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.
అనంతరం వెంకట్ రెడ్డి మరియు విజయలక్ష్మి మాట్లాడుతు విద్యార్థులే భావి భారత పౌరులు. దేశానికి బలమైన పునాదులు. విద్యార్థులను క్రమశిక్షణలో తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత. అప్పట్లో మేము చూపిన సక్రమమైన మార్గదర్శకత్వం వల్లే మీరు ఈరోజు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు అందిస్తున్నారు” అని పేర్కొన్నారు. పాఠశాల రోజుల్లోని అనుభవాలు, క్రమశిక్షణ విలువలను గుర్తుచేస్తూ భావోద్వేగంగా మాట్లాడారు.
విజయలక్ష్మి టీచర్ మాట్లాడుతూ 37 సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకుని, మళ్లీ కూకట్‌పల్లి జెడ్పీ హైస్కూల్‌కు పిలవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది నా జీవితంలో మరచిపోలేని క్షణం” అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు.తదుపరి పూర్వ విద్యార్థులు ఒక్కొక్కరుగా తమ పరిచయాలను చేసుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువేశారు. పాఠశాల రోజుల్లోని అల్లరి, ఉపాధ్యాయుల క్రమశిక్షణ, స్నేహబంధాల గురించి మాట్లాడుకుంటూ ఎంతో ఉత్సాహంగా గడిపారు. ఇలాంటి సమ్మేళనాలను భవిష్యత్తులోనూ తరచుగా నిర్వహించాలని నిర్ణయించారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, నిజాంపేట మాజీ కార్పొరేటర్ కొలను శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రవెల్లి వాసుదేవరావు, రాజేందర్, శ్రీనివాస్, ఇందిర, భానురేఖ, ప్రేమలత, వల్లి, పద్మ, సక్కుబాయి, వెంగళరావు, గోపాలకృష్ణ, జీత్‌రాజ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.37 వసంతాల అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసిన ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, కూకట్‌పల్లి జెడ్పీ హైస్కూల్ చరిత్రలో మరో మధుర జ్ఞాపకంగా నిలిచింది.



