Listen to this article

జీ ఎమ్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మచ్చేందర్

జనం న్యూస్ 13 జనవరి సంగారెడ్డి జిల్లా ఇంఛార్జి

నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన ఉల్లి రైతులు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఉల్లి పంట సాగు కోసం విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అయినప్పటికీ రైతు పండించిన పంటకు సరైన ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు.ఈ పరిస్థితి రైతుల జీవనాధారాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది.
ఈ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ నారాయణఖేడ్ నియోజకవర్గం తరపున జీ ఎమ్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మచ్చేందర్ ఈ వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ కి సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా మచ్చేందర్ మాట్లాడుతూ,ఇది ఎటువంటి రాజకీయ అంశం కాదని,పూర్తిగా రైతు బతుకు కోసం సాగుతున్న న్యాయమైన పోరాటమని స్పష్టం చేశారు. ఉల్లి విత్తనాల ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని,కానీ ప్రభుత్వం విత్తనాల ఖర్చులను భరించకపోవడం వల్ల రైతులు అప్పులు చేసి పంట సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర అప్పుల భారంలో కూరుకుపోతున్నారని తెలిపారు.ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధరలు తీవ్రంగా పడిపోయాయని, రైతుకు కనీసం క్వింటాలుకు ఏడు వందల ఇరవై రూపాయల ధర కూడా రావడం లేదని పేర్కొన్నారు. ఉల్లి రైతులకు కనీస మద్దతు ధరను క్వింటాలుకు ఏడు వందల ఇరవై రూపాయలుగా ప్రకటించకపోతే ఉల్లి సాగు పూర్తిగా నష్టసాధనంగా మారుతుందని హెచ్చరించారు. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రైతులు ఉల్లి సాగును వదిలివేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు.అలాగే ప్రతి మండలంలో ఉల్లి నిల్వ గిడ్డంగులు లేకపోవడం రైతులకు పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో రైతులు వెంటనే పంటను అమ్ముకోవాల్సి వస్తోందని, ఈ పరిస్థితిని దళారులు అవకాశంగా మార్చుకుని అతి తక్కువ ధరలకు పంటను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతుండగా, దళారులు మాత్రమే లాభాలు పొందుతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎగుమతులు ప్రారంభిస్తే మార్కెట్లో ధరలు స్థిరపడతాయని, రైతుకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఉల్లి కొనుగోలు చేపట్టి రైతును ఆదుకోవాలని, దళారుల దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కోరారు.రైతు లేకపోతే సమాజానికి ఆహారం ఉండదని, రైతే దేశానికి పునాది అని గుర్రపు మచ్చేందర్ స్పష్టం చేశారు. రైతు శ్రమకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని తెలిపారు. గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గ ఈ సమస్యలన్నింటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని వినమ్రంగా కోరారు.రైతుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నారాయణఖేడ్ నియోజకవర్గ రైతులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.రైతుల ప్రధాన డిమాండ్లు:ఉల్లి విత్తనాల ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరించాలి ఉల్లి రైతులకు క్వింటాలుకు కనీస మద్దతు ధరగా ఏడు వందల ఇరవై రూపాయలు ప్రకటించాలి ప్రతి మండలంలో ఉల్లి నిల్వ గిడ్డంగులు ఏర్పాటు చేయాలి ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలి దళారుల దోపిడీని అరికట్టి ప్రభుత్వం నేరుగా ఉల్లి కొనుగోలు చేయాలి