జనం న్యూస్ జనవరి 16 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి : గంజాయి కేసుల్లో నిందితులు ఎక్కడ దాక్కున్నా చట్టం నుండి తప్పించుకోలేరని నాతవరం పోలీసులు నిరూపించారు. గత నాలుగేళ్లుగా పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఒక కీలక నిందితుడిని నాతవరం పోలీసులు అత్యంత చాకచక్యంగా ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. నాతవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2022లో నమోదైన క్రైమ్ నంబర్ 123/22 (NDPS Act) కేసులో పశ్చిమ ఢిల్లీకి చెందిన రోహిత్ కుమార్ (39),* తండ్రి ప్రీతమ్ సింగ్, ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కేసు నమోదైనప్పటి నుండి ఇతను పరారీలో ఉన్నాడు. ఇతనిపై కోర్టు NBW (Non-Bailable Warrant) కూడా జారీ చేసింది. జిల్లా పోలీస్ ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు, నాతవరం ఎస్సై వై.తారకేశ్వరరావు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక నిఘా పెట్టారు. నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో, అక్కడికి చేరుకున్న పోలీస్ బృందం నిందితుడిని చాకచక్యంగా పట్టుకుని, నాతవరం పోలీస్ స్టేషన్‌కు తీసుకుని వచ్చి, ఈ రోజు రిమాండ్ కు తరలించారు. క్లిష్టమైన ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఎస్సై తారకేశ్వరరావు మరియు పి.సి టి.సన్యాసిరావు లకు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, మరియు అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. గంజాయి రవాణాదారులపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.గంజాయి కేసుల్లో నిందితులు ఎక్కడున్నా తప్పించుకునే అవకాశం లేదు. అక్రమ గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల రవాణా చేసేవారు, సేవించేవారు “తస్మత్ జాగ్రత్త” అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.//


