జనం న్యూస్ జనవరి 16, వికారాబాద్ జిల్లా
పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో MEPMA ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.2 కోట్ల 15 లక్షల బ్యాంక్ రుణాల చెక్కులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ మాట్లాడుతూ, ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని మహిళలు స్వయం ఉపాధి సాధించి తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకోవాలని సూచించారు. మహిళల ఆర్థిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా వారి భద్రత, సౌకర్యాలు పెరిగాయని అన్నారు. అదేవిధంగా, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు నడుపుకునే అవకాశాన్ని కల్పించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. ఇది మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో కీలకంగా మారుతుందన్నారు.ఇక మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు, స్వయం సహాయక సంఘంలోని సభ్యురాలు మరణించిన పక్షంలో ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల బీమా సహాయం అందించే విధానం అమలులో ఉందని పేర్కొన్నారు. ఇది మహిళల కుటుంబాలకు భరోసా కల్పించే చర్యగా నిలుస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో MEPMA అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


