బిచ్కుంద జనవరి 16 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన బండయప్ప మఠం పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప గారిపై 14-01-2026 నాడు మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే గారు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర ఆవేదన కలిగించాయని కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో, సోమయ్యప్ప గారి శిష్యుడైన ఏలే మల్లికార్జున్ గారు బిచ్కుంద మఠానికి వెళ్లి పీఠాధిపతిని మర్యాదపూర్వకంగా పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, ఒక ఆధ్యాత్మిక గురువుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఇది సమాజాన్ని బాధపెట్టే చర్యగా అభివర్ణించారు. హనుమంత్ షిండే గారి వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.అనంతరం, ఈ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేపు బిచ్కుంద బంద్‌కు పిలుపునిస్తూ, ఈ బంద్ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇది వ్యక్తిగత రాజకీయ అంశం కాదని, ఆధ్యాత్మిక విలువలు, గౌరవాన్ని కాపాడుకునే ఉద్యమమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బిచ్కుంద మఠానికి సంబంధించిన శిష్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. మఠం గౌరవాన్ని కాపాడేందుకు సమాజం ఏకతాటిపై నిలవాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు.ఆధ్యాత్మిక గురువుల గౌరవం కోసం ఐక్య పోరాటం – బిచ్కుంద బంద్‌కు సర్వత్రా మద్దతు వెల్లువెత్తుతోంది.


