Listen to this article

జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

కాట్రేనికోన మండలం కొప్పిగుంట గ్రామంలో ఎందరో విద్యార్థుల జీవితాలలో వెలుగు రేఖలు ప్రసరింపజేసి ఎందరికో ఉజ్వల భవిష్యత్తును అందించిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల స్థాపించి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా కొప్పిగుంట గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో పాఠశాల శత వసంతాల వేడుక అంగరంగ వైభవంగా జరిగాయి. గ్రామ పెద్దల నేతృత్వంలో కొప్పిగుంట గ్రామ సేవా సమితి ఆధ్వర్యంలో 1925 నుండి 2025 వరకు ఈ గ్రామ బడిలో విద్యాభ్యాసం చేసి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాలలో వివిధ హోదాలలో పదవీవిరమణ చేసిన వారిని వివిధ ఉద్యోగాలలో స్థిరపడిన వారినీ ఆహ్వానించి వారి యొక్క అనుభవాలు వారి యొక్క జ్ఞాపకాలను అందరితో పంచుకుంటూ ఆధ్యాంతం ఒక ఆత్మీయ వేడుకలా జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా గ్రామానికి చెందిన బాల బాలికల శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాట్రేనికోన యస్ .ఐ అవినాష్ గారు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ విద్యాలయాన్ని పవిత్రమైన ఆలయంగా భావించిన గ్రామ పెద్దలు అభినందననీయులని,దేవాలయంలాంటి విద్యాలయం వందేళ్ళ పండుగ నిర్వహించడం ఆనందదాయకమని మన సంస్కృతి సాంప్రదాయాలయిన సంక్రాంతి పర్వదినం సందర్భంగా పాఠశాల శతవసంతాల వేడుక నిర్వహించడం మంచి పరిణామమని తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామ పాఠశాల వందేళ్ళ చరిత్రలో విద్యనభ్యసించినటువంటి వారిని మాత్రమే కాకుండా ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారిని కూడా ఆహ్వానించడం జరిగినది. వివిధ శాఖలలో ఉద్యోగులుగా ఉపాధ్యాయులుగా వివిధ ప్రాంతాలలో సేవలందించిన ఆనాటి పూర్వ విద్యార్థులు నేటి ప్రముఖులను దుశ్శాలువ అభినందన జ్ఞాపికతో కొప్పిగుంట గ్రామ సేవా సమితి వారిని ఘనంగా సత్కరించుట జరిగినది. ఆనాటి నుండి ఈనాటి వరకు వారిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను సగౌరవంగా సన్మానించుట జరిగినది. ఓవైపు గ్రామబడి వందేళ్ల పండుగ మరోవైపు సంక్రాంతి పండుగ ప్రతిబింబమైన ముగ్గుల పోటీలతో గ్రామమంతా సందడి వాతావరణంలో ఈ వేడుకలు వైభవంగా జరిగాయి. భవిష్యత్తులో పాఠశాల అభివృద్దికి విద్యార్థుల అభ్యున్నతికి తమ సహాయ సహకారాలు అందిస్తామని వక్తలు తమ సందేశాలలో తెలియజేశారు. ఈ వేడుక భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా మార్గదర్శకత్వంగా నిలవాలని గ్రామంలో విద్యనభ్యసిస్తున్న వారికి ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన మార్గదర్శకత్వాన్ని ఈ గ్రామ సేవా సమితి ద్వారా అందించాలని పలువురు వక్తలు ఆకాంక్షించారు.ఈ వందేళ్ల పండుగలో ఆనాటి మధుర జ్ఞాపకాలను చిన్ననాటి మధుర స్మృతులను నెమరు వేసుకుంటూ ఆత్మీయంగా పలకరించుకుంటూ ఆనందంగా గడిపారు.ఈ సంవత్సరం పదవ తరగతిలొ ప్రగతి సాధించిన విద్యార్థులకు నగదును అందించారు.ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన గ్రామ సేవా సమితి,ప్రముఖుల సూచనలు సహకారంతో దిగ్విజయం చేసిన కమిటీ వారికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రంగోలీ పోటీలలో విజేతలైన వారికి బహుమతి ప్రధానం చేశారు.ఈకార్యక్రమం రాజకీయాలకు అతీతంగా జరగడం విశేషం.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువతి యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.