Listen to this article

జనం న్యూస్ జనవరి 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

సముద్ర తీర ప్రాంతంలో కొలువై ఉన్న కాలభైరవుని క్షేత్రం పరమ పవిత్రమైనది. సంతానం లేని స్త్రీలు కాలభైరవుని క్షేత్రంలో నిదురిస్తే వారికి పిల్లలు పుడతారని ప్రతీతి. దీంతో ఈ క్షేత్రానికి మహిళ భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తుంటారు.క్షేత్ర మహిమ: సముద్ర తీర ప్రాంతంలో సముద్రం పై వేట కొనసాగిస్తూ జీవనం కొనసాగించే మత్స్యకార వర్గాలు ఎక్కువగా ఉంటారు. పూర్వం వీరు సముద్రంలో వేటాడుతుండగా పాద ముద్రలు, శివ, పార్వతి శిలలు వలలో చిక్కుకున్నాయి. వీటిని వారు సముద్రంలోకి విసిరేశారు. మరల అదే ప్రాంతంలో అవే శిలలు చిక్కాయి. మరలా రెండోసారి కూడా సముద్రంలోకి విసిరేశారు. మూడోసారి కూడా అవే శిలలు రావడంతో దైవానుగ్రహంగా భావించిన మత్స్యకారులు వాటిని సముద్ర తీర ప్రాంతంలో ప్రతిష్టించారు. ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించేవారు. బ్రహ్మదేవుడికి ఉన్న శాపం మూలంగా ఎక్కడ గుడి ఉండదు. ఈశ్వర రూపంలో బ్రహ్మేశ్వరుడు గా కొలువైయున్నాడు. కాలభైరవుడు, వేణుగోపాలుడు, కనకదుర్గ, పార్వతి మొదలైన దేవతామూర్తులు కూడా కొలువై ఉన్నారు.ప్రతి ఏటా ఉత్సవాలు : ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. భారీ ఎత్తున పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. తీర్థం తిలకించడానికి వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు.ఇలా చేరుకోవచ్చు : ఈ ప్రాంతంలో జరిగే చొల్లంగి తీర్థం వీక్షించడానికి జిల్లా నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడకు చేరుకుంటారు. మండల కేంద్రమైన కాట్రేనికోన నుండి వేట్లపాలెం, చిర్ర యానాం గ్రామాల మీదుగా రోడ్డు మార్గం గూండా ఇ క్కడకు చేరుకోవచ్చు. గెద్దనపల్లి, దొంతి కుర్రు, పల్లం గ్రామాల మీదుగా ఇక్కడకు చేరుకోవచ్చు.ఆహ్లాదకరమైన వాతావరణం: సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఈ ఆలయం వద్ద వాతావరణంఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 17వ తేదీ శనివారం సాయంత్రం భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. సూర్యాస్తమయాన్ని సముద్రం వద్ద తిలకిస్తారు. ఆదివారం సముద్ర స్నానం ఆచరించి సముద్ర గర్భం నుండి బయటకు వచ్చే సూర్య భగవానుడిని చూసి తన్మయం చెందుతారు.మార్గం వెంబడి మడ అడవులు కను విందు చేస్తాయి. ఏపీఎస్ఆర్టీసీ అమలాపురం డిపో నుండి ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తారు.
నూతన ఆలయం మరింత శోభితం : పూర్వకాలంలో కట్టిన గుడి శిథిలావస్థకు చేరుకోవడంతో ఇటీవల నూతన ఆలయాన్ని నిర్మించారు. భక్తులకు కనువిందు చేసే విధంగా ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది. ఈ ఆలయ ఆవరణలో నవగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు.పోలీస్ బందోబస్తు : అమలాపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కే ప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్ పర్యవేక్షణలో కాట్రేనికోనతో పాటు వివిధ పోలీస్ స్టేషన్లనుండి సిబ్బంది ఇక్కడవిధులు నిర్వహిస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తారు.