జనం న్యూస్ 19 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ప్రజాకవి, సంఘ సంస్కర్త యోగి వేమన జయంతిని జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు కార్యాలయంలో జనవరి 19న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పాల్గొని, యోగి వేమన చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – ‘ఆటవెలది’ని ఈటెగా విసిరిన దిట్ట – ఛాందస భావాలకు తొలి అడ్డుకట్ట వేమన రచనలేనన్నారు. ప్రజలకు అర్ధమయ్యే రీతిలో వేమన రచించిన నీతి పద్యాలు తెలుగు వారందరికి సుపరిచితమేనన్నారు. ‘విశ్వదాభిరామ వినురవేమ’ అనే ముక్తాయింపుతో ఆటవెలది పద్యాలు రాశారన్నారు. యోగి వేమన అద్భుతమైన కవిత్వంతో నీతి పద్యాలను రచించి, వాటిలో విలువలు, సలహాలు, సూచనలను ప్రజలకు అందించారన్నారు. మానవత ధర్మం, సర్వమానవ సమానత్వం, నైతికత, కుల వివక్ష, మూఢ నమ్మకాలను ఖండిస్తూ, మహిళలను గౌరవిస్తూ సంప్రదాయవాదిగా రచనలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. ఆంగ్లేయుడైన ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు భాషపై ఆసక్తితో మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ యోగి వేమన రచనల గురించి పరిశోధన చేసి, పలు వేమన పద్యాలను సేకరించి, వాటిని ఆంగ్లం, లాటిన్ భాషల్లోకి అనువదించారన్నారు. తెలుగు కవిగా యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రతీ ఏడాది జనవరి 19న నిర్వహిస్తున్నదని జిల్లా ఎస్పీ తెలిపారు. యోగి వేమన నేడు మన మధ్య లేకున్నా అతడి రచనలు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తూ, మనలో చైతన్యం నింపుతున్నాయన్నారు. అటువంటి మహనీయుడిని స్మరించుకుంటూ, జిల్లా పోలీసు కార్యాలయంలో వేమన జయంతి వేడుకలను నిర్వహించుకోవడం మనందరి బాధ్యతని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అన్నారు. అనంతరం, అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, ఎఆర్ డిఎస్పీ ఈ.కోటి రెడ్డి మరియు ఇతర పోలీసు అధికారులు యోగి వేమన చిత్ర పటానికి పూల మాలలు వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సౌమ్యలత, ఎఆర్ డిఎస్పీ ఈ. కోటి రెడ్డి, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్. గోపాల నాయుడు, పి.శ్రీనివాసరావు, ఆర్.రమేష్ కుమార్, పలువురు ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.


