Listen to this article

జనం న్యూస్ జనవరి 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి

రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని బుధవారం కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించి, ప్రజల్లో బాధ్యతాయుతమైన వాహనచలనంపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ ట్రాఫిక్ (మేడ్చల్) జె. రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ, రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణ భద్రతే పోలీసు శాఖ యొక్క ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని, అందువల్ల వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ క్రమశిక్షణతో వాహనాలు నడపాలని సూచించారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం తప్పనిసరి అని, మద్యం సేవించి వాహనం నడపడం నేరమని తెలిపారు. వేగ పరిమితిని అతిక్రమించకూడదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన సదస్సులో అడిషనల్ డీసీపీ వీరన్న, ట్రాఫిక్ ఏసీపీలు ఎస్. గిరి ప్రసాద్, వెంకటయ్య, వెంకట్ రెడ్డి, సీఐలు తిమ్మప్ప, ప్రశాంత్, జానయ్య, నరసింహారావు రావు, వెంకటేశ్వర రావు, విద్యాసాగర్ రెడ్డి, బి. మధుసూదన్, శ్రీనివాసరావు అప్పలనాయుడు, జంగయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.