జనంన్యూస్. 22.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని పర్మిషన్ లేకుండా ఇసుక పాయింట్లకు ట్రాక్టర్ యజమానులు వెళ్లిన,అక్రమ ఇసుక రవాణా చేసిన కఠిన చర్యలు తప్పవని సిరికొండ మండల తాసిల్దార్ హెచ్చరించారు. మండల పరిధిలో కొంతమంది అక్రమ దళారులు పేద లబ్ధిదారుల పేర్లను దుర్వినియోగం చేస్తూ, అవసరమైన ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇసుక పాయింట్ల వద్దకు వెళ్లి భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారనీ తాసిల్దార్ అన్నారు.ఈ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయ నష్టం వాటిల్లడమే కాకుండా సహజ వనరులపై తీవ్ర ప్రభావం పడుతోందని ,ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే ప్రతి లబ్ధిదారుడు ముందుగా గ్రామ కార్యదర్శికి ఇంటి నిర్మాణ అనుమతికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. అనంతరం తహసిల్దార్ కార్యాలయం నుంచి అధికారికంగా ఇసుక పర్మిషన్ పొందిన తరువాత మాత్రమే నిర్ణీత పరిమాణంలో ఇసుక రవాణా చేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఈ నిబంధనలన్నింటిని పూర్తిగా పక్కన పెట్టి, కొందరు అక్రమ రవాణాదారులు లబ్ధిదారులకు తెలియకుండానే లేదా వారి పేర్లను ఉపయోగించి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం వచ్చిందని, ఎవరైనా పర్మిషన్ లేకుండా ఇసుక పాయింట్లు వద్దకు వెళ్లిన, ఇసుక తరలించిన ట్రాక్టర్లను సీజ్ చేసి, టక్టర్ డ్రైవర్, యజమానులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తాసిల్దార్ తెలిపారు.


