జనం న్యూస్ 23 జనవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ప్రజాస్వామ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఓటర్ గా తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.ఈ నెల 25న 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం ఐడిఓసి సమావేశపు మందిరంలో జిల్లా అధికారులు, సిబ్బందితో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేసేందుకు, ఆయా ఎన్నికల్లో అత్యధిక ఓటర్లు ఓటును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు జాతీయ ఎన్నికల సంఘం 2011 నుంచి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రజాస్వామ్య దేశంలో అందరికీ ఆమోదయోగ్యమైన, ఎక్కువ మంది ఆదరణను పొందిన పాలకులను మన ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు హక్కు కల్పించడం జరిగిందన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి గతంలో ప్రజలకు చాలా తక్కువగా అవగాహన ఉండేదని, ప్రస్తుతం జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహిస్తున్నందున ప్రతి పౌరుడు ఓటు విశిష్టతను తెలుసుకొనేందుకు అవకాశం కలిగిందన్నారు. ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.జారీ చేయువారు: డిపిఆర్ఓ / జోగులాంబ గద్వాల జిల్లా.


