జనం న్యూస్, జనవరి 23 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి – శ్రీనివాస్ రెడ్డి
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నేడు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐడీఎల్ రంగదాముని చెరువు వద్ద ‘ఆరైవ్ ఆలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు విలువైన సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీవన విధానంలో మార్పులు, సరైన నిద్రలేమి, తొందరగా గమ్యానికి చేరుకోవాలనే ఆతురత కారణంగానే అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. మానవ ప్రాణం ఎంతో అమూల్యమైనదని, దానిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అలాగే తమపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు.
“స్టార్ట్ ఎర్లీ – గో స్లోలీ – రీచ్ సేఫ్లీ” అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి బసంతి ఫౌండేషన్ సహకారంతో హెల్మెట్లు పంపిణీ చేయగా, ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులను సీపీ అభినందించారు.
హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలిపోతుందనే అపోహ కారణంగా కొందరు హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్నారని, అయితే హెల్మెట్ లేకుండా ప్రయాణం ప్రాణాంతకంగా మారవచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో, ఇలాంటి అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోన్ డీసీపీ రీతి రాజ్, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ రంజన్ రత్నకుమార్, అదనపు డీసీపీ (ట్రాఫిక్), బాలానగర్ ఏసీపీ, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ (మూసాపేట), మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, ఆర్టీసీ డిపో మేనేజర్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



