జనం న్యూస్ 24 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ప్రజా భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసు యంత్రాంగం వినూత్న కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చాలా దగ్గరవుతున్నారు. ప్రజల్లో కూడా పోలీసు యంత్రాంగం అందిస్తున్న సేవల పట్ల ఒక నమ్మకం విశ్వాసం పెరిగింది. నేరాలను అరికట్టడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరితగతిన అందిపుచ్చుకొని చేపడుతున్న నేర నిరోధక చర్యల ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న అసాంఘిక శక్తులకు డ్రోన్ కెమెరాల ద్వారా అడ్డుకట్ట వేస్తున్నారు. నేటి యువతరం చెడు మార్గాలను పట్టకుండా అప్రమత్తంగా ఉండేందుకు పాఠశాల స్థాయి నుండి కళాశాల వరకు విద్యార్థినీలకు ప్రతిరోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ అనే కార్యక్రమం ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి విశేష స్పందన కనిపిస్తుంది.అలాగే ద్విచక్ర వాహనాల ప్రమాదాల నివారణకు ఇటీవల నో హెల్మెట్.. నో పెట్రోల్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ట్రాఫిక్ నియంత్రణకు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. అక్కడక్కడా సిసి కెమెరాలు ఏర్పాటుతో అసాంఘిక శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా, పేకాట ఆడినా ఇంకా ప్రజా క్షేమం కోసం నిరంతర నిఘాతో ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని అమాంతం పెంచేశారు. స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదులను చాలావరకు కోర్టుల వరకు వెళ్లకుండా ఒక మంచి కౌన్సిలింగ్ ద్వారా చాలా మేరకు పరిష్కరిస్తూ ఇది పార్టీలకు ఊరట కలిగిస్తున్నారు. ఇలా ప్రతిదీ ప్రజలతో మమేకమై ప్రజల మనిషిగా స్నేహపూరిత వాతావరణాన్ని కలిగిస్తూ సమాజ సేవకు అంకితమవుతున్నారు.
ఖాకీలంటే ప్రజా రక్షకులని… ప్రజా సేవకులు గాను విశేషమైన సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఎండనక వాననక రేయింబవళ్లు ప్రజలను సొంత కుటుంబ సభ్యుల్లా పహారా కాస్తూ చేదోడు వాదోడుగా ఉంటూ తామున్నామన్న భరోసా కల్పిస్తున్నారు. పటిష్ట భద్రతా వ్యవస్థ… నిరంతర నిఘాతో అరాచక శక్తుల ఆగడాలకు కట్టడి చేస్తూ చర్యలు చేపడుతున్నారు. పోలీసు యంత్రాంగం చేపడుతున్న ఈ విధానాల పట్ల ప్రజల్లో మంచి నమ్మకం ఏర్పడిందని చెప్పాలి. భేష్ పోలీస్ అంటూ ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు.


