Listen to this article

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
జనం న్యూస్.ఫిబ్రవరి 7, 2025 : కొమురం భీమ్ జిల్లా. (ఆసిఫాబాద్ )డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.జైనూర్. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన నిర్మాణాల పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లాలోని జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామపంచాయతీలో కొనసాగుతున్న సి. ఎస్. సి. (కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్) నిర్మాణ పనులను పరిశీలించి నిర్దేశిత సమయంలోగా పూర్తిచేసే విధంగా నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆశ్రమ బాలికల పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాల, మూత్రశాలలు, త్రాగునీటి సౌకర్యం, పరిసరాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా డైట్ చార్జీలను పెంచి నూతన మెనూను అమలు చేస్తుందని, ఈ క్రమంలో సకాలంలో విద్యార్థులకు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని తెలిపారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలని, 10వ తరగతి వార్షిక పరీక్షలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు. తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని, అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ నర్సరీని సందర్శించి నాటేందుకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను పెంచాలని, ఆయా శాఖలకు కేటాయించిన ప్రకారంగా మొక్కలను అందించేందుకు సిద్ధం చేయాలని తెలిపారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు సకాలంలో పోషకాహారం అందించడంతో పాటు ఇష్టపడి చదివేలా వినూత్న పద్ధతులలో చదువు అలవాటు చేయాలని తెలిపారు. తదనంతరం ఆశ్రమ బాలుర పాఠశాలను సందర్శించి త్రాగునీటి వసతి, మూత్రశాలలు, మరుగుదొడ్లు, పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, పాఠ్యాంశాల బోధన అంశాలపై విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది