జనం న్యూస్ 26 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం, గోట్లాం బైపాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్వయంగా సందర్శించి, క్షుణ్ణంగా పరిశీలించారు. జనవరి 25న ఉదయం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనంను ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెలుతున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికడే మరణించారని తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదం జరిగిన ప్రదేశం బ్లాక్ స్పాట్ ప్రదేశమా, ప్రమాదం జరుగుటకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రోడ్డు ప్రమాదం పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని, దగ్గరలో ఉండే సి.సి.టి.వి. కెమెరాల ఫుటేజిని పరిశీలించి ప్రమాదానికి గల ఖచితమైన కారణాలను అన్వేషించాలని అధికారులని ఎస్పీ ఆదేశించారు. ప్రమాద సమయంలో వాహనం నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ ధరించే ఉన్నాడని, కాని బి.ఐ.ఎస్. మార్కు ఉన్న హెల్మెట్ కాకపోవడం వలన హెల్మెట్ పగిలిపోయి దురదృష్టవసాత్తు మరణించాడని, వెనుక ఉన్న వ్యక్తి కూడా తీవ్ర గాయాలతో అక్కడే మరణించాడని తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతుందని, ద్విచక్ర వాహన దారుడు నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగిందా లేదా బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా అనే దిశగా దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఒకవేళ ఆర్.టి.సి. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగినట్లు రుజువైతే, బస్సు డ్రైవర్ పై నేరపూరిత నరహత్య క్రింద కేసును నమోదుచేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు.ఈ నెలలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులు ఢీకొని జిల్లాలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకపక్క రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా పోలీసులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని, రెండు రోజులక్రితమే విజయనగరంలో ఆర్.టి.సి. డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి జాగ్రత్తలు చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. ఎస్పీ కార్యాలయంలో విజయనగరం ఆర్టీసీ మేనేజరుతో కూడా సమావేశం అయి సమీక్షించినా ఆర్టీసీ బస్సుల వలన ప్రమాదాలు ఆగడం లేదని, డ్రైవర్లు నియమాలు పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదే విధంగా వాహనదారులు నాణ్యత కలిగిన బి.ఐ.ఎస్. మార్కు హెల్మెట్ ధరించాలని సూచించారు.ఎస్పీ వెంట బొబ్బిలి డిఎస్పీ జి.భావ్యరెడ్డి, గజపతినగరం సిఐ జి.ఎ.వి.రమణ, బొండపల్లి ఎస్ఐ యు.మహేష్ మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు.


