Listen to this article

జనం న్యూస్‌ 31 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

విజయనగరం పట్టణంలోని ఎస్.ఎం.ఆర్.పి.ఆర్.సి. బధిర పాఠశాలలో చదువుతున్న బధిర విద్యార్థులతో జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ జనవరి 30న పోలీసు కార్యాలయంలో మమేకమై, వారికి ఇండోర్ మరియు అవుట్ డోర్ గేమ్స్ ఆడేందుకు వినియోగించే క్రీడా పరికరాలను అందజేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మాట్లాడుతూ – ఆత్మ విశ్వాసంతో ఏ పనినైనా చేపడితే ఎన్ని అవరోధాలనైనా అధిగమించి, విజయం సాధించవచ్చునన్నారు. ఇతరులకంటే శారీరకంగా లోపాలున్నా విజయం సాధించేందుకు ఇవేవి అవరోధాలు కాదని, బధిర విద్యార్థులకు సూచించారు. ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం, ధృఢ సంకల్పంతో చదివితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చునన్నారు. కావున, చదువును నిర్లక్ష్యం చేయవద్దని, ఇష్టంతో చదువుకోవాలన్నారు. మన ఉన్నతికి నిరంతరం శ్రమించే తల్లిదండ్రులు, మార్గనిర్దేశం చేసే ఉపాధ్యాయులు చూపే మార్గంలో పయనించి, మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకొని, ఉన్నతమైన ఉద్యోగాలు సాధించాలని బధిర విద్యార్ధులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.
అనంతరం, బధిర విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో ఏవిధంగా విద్యను నేర్పుతున్నది, వారికి వచ్చిన సందేహాలను ఏవిధంగా నివృత్తి చేస్తున్నది ఉపాధ్యాయులను జిల్లా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. బధిర విద్యార్ధులతో జిల్లా ఎస్పీ కాసేపు ముచ్చటించి, వారి పేర్లు, ఏ ప్రాంతానికి చెందినవారన్నది అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులు బస చేసే హాస్టల్ నందు ఇండోర్ గేమ్స్ ఆడేందుకు, వారి మేధస్సును పెంచేందుకు ఉపయుక్తమైన కేరమ్స్, చెస్, క్రికెట్, షటిల్ బాట్స్, బాల్స్ వంటి ఇతర క్రీడా పరికరాలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అందజేసారు.ఈ కార్యక్రమంలో విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్బి సిఐ ఎ.వి.లీలారావు, విజయనగరం రూరల్ సిఐ బి.లక్ష్మణ రావు, విజయనగరం రూరల్ ఎస్ఐ వి.అశోక్ కుమార్, హాస్టల్ వార్డెన్ రత్న బాయి, స్టాఫ్ నర్స్ సిహెచ్.వుష్ప తదితరులు పాల్గొన్నారు.