జనం న్యూస్ 01 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
భోగాపురం పోలీసు స్టేషన్ పరిధిలో 2018లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితుడు, భోగాపురం మండలం పెదకవులువాడకు చెందిన గాలి అప్పన్న (35)కు 5 ఏళ్ల కారాగార శిక్ష, రూ.55,000 జరిమానా విధిస్తూ విజయనగరం ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె. విజయకళ్యాణి జనవరి 31న తీర్పు వెల్లడించినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.కేసు వివరాలు:భోగాపురం మండలం పెదకవులువాడ గ్రామంలో నివాసం ఉంటున్న ఫిర్యాది ఎరుసు రాము కిరాషాపు నడుపుతుండేవాడు. 12-09-2018న అదే గ్రామానికి చెందిన గాలి అప్పన్న కిరాణా షాపు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో పాత బాకీ డబ్బులు అడుగుతున్నాడనే నెపంతో ఫిర్యాదిపై నిందితుడు గాలి అప్పన్న కత్తితో దాడి చేసి గాయపరిచాడు. బాధితుడిని వెంటనే భోగాపురం సీహెచ్‌సీ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భోగాపురం పోలీసు స్టేషనులో కేసు నమోదైంది.దర్యాప్తు మరియు తీర్పు:అప్పటి భోగాపురం ఎస్ఐ హెచ్.ఉపేంద్ర ఈ కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అనంతరం ఎస్ఐ పి.రామకృష్ణ దర్యాప్తును కొనసాగించి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. విచారణలో నిందితుడు గాలి అప్పన్నపై నేరారోపణలు రుజువుకావడంతో న్యాయమూర్తి కె.విజయకళ్యాణి శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చారు.ఈ కేసులో సాక్షులను సమర్థవంతంగా బ్రీఫ్ చేసిన కోర్టు కానిస్టేబులు వి.సత్యన్నారాయణ, సీఎంఎస్ హెచ్‌సీ సీహెచ్.రామకృష్ణను ఎస్పీ అభినందించారు. పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటరు జి.సత్యం వాదనలు వినిపించగా, భోగాపురం సీఐ కె.దుర్గాప్రసాద్ ప్రాసిక్యూషన్ ప్రక్రియను పర్యవేక్షించారు. నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన ఏపీపీ, పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు.


