జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ 2026
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేడు మరో కీలక ఘట్టం ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది.రాజకీయ పార్టీల తరఫున పోటీలో ఉన్న అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు బీఫారమ్ సమర్పించాలి. అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో రూపొందించి, వారికి గుర్తులు కేటాయించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏఐ టూల్స్ రూపొందించి కలెక్టర్లకు పంపించింది. మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఐఏఎస్ అధికారి మకరందు రూపొందించిన “సెక్యూర్” యాప్ ద్వారా సులువుగా ప్రక్రియ ముగిసేలా ఎస్‌ఈసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 22 వేల 519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. ఇండిపెండెంట్లుగా 3 వేల 748 మంది నామపత్రాలు అందించారు. సరైన వివరాలు లేకపోవడంతో 2 వేల 911 నామినేషన్లు తిరస్కరించగా, 19 వేల 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 11న జరగనున్న పోలింగ్ ద్వారా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నిక కానున్నారు. మున్సిపాలిటీల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నిక కోసం ఈ నెల 14న నోటీసు జారీ చేస్తారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజున మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు.మేయర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక కోసం ఎక్స్‌అఫీషియో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్లతో పాటు ఎక్స్‌అఫీషియో సభ్యులకు ఓటు ఉంటుంది. అందువల్ల జాబితా సిద్ధం చేయాలన్నారు. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఇప్పటికే నమోదైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివరాలు పంపించాలని రాణికుముదిని కలెక్టర్లకు తెలిపారు. ఈ నెల 11 నుంచి 14 వరకు కొత్తగా నమోదు చేసుకోదలచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వివరాలు సేకరించాలని చెప్పారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడికి ఏదైనా ఒక మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమావేశానికి కనీసం సగం మంది సభ్యులుంటే కోరంగా పరిగణించాలని, లేకపోతే మరుసటి రోజున నిర్వహించాలని ఎస్ఈసీ వివరించింది. చేతులెత్తే విధానంలో ఓటింగ్ ఉంటుందని, పార్టీ విప్‌ను సభ్యులుగా పాటించాల్సి ఉంటుందని ఎస్ఈసీ వెల్లడించింది._


