నేటి నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు
జనం న్యూస్ ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కోరిన కోరికలు
తీర్చే చల్లని తల్లిగా పేరొందిన గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈనెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఘనంగా జరగను న్నాయి. ఇప్పటికే ఆలయం వద్ద భారీ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేసి ఐదు రోజులు పాటు రాత్రి వేళ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి రోజు ఎనిమిదో తేదీన భారీ అన్న సమారాధన నిర్వహిస్తారు. అదే రోజు అమ్మవారిని మేళ తాళాలు భాజా భజంత్రీలు మధ్య ఘనంగా ఊరేగిస్తారు. విచిత్ర వేషాలు, జానపద, కోయల, నృత్య ప్రదర్శనలు, కళాఖండాలు ఉంటాయి. కన్నుల పండుగగా ఉండే బాణా సంచాను కాల్చే దృశ్యాలను చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివస్తారు. ఏటా మూడు లక్షలకు పైగా ప్రజలు ఉత్సవాలను తిలకించేందుకు వస్తూ ఉంటారు. సత్తెమ్మ తల్లి జాతరకు ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి రావడం విశేషంగా చెప్పుకోవచ్చు. సత్తెమ్మ తల్లి అంటే ఈ ప్రాంత వాసులకు అపార నమ్మకం. కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా కొలుస్తారు. సంతానం లేని వారికీ సంతాన ప్రాప్తి లభిస్తుందంటారు. ఏ ఆపద వచ్చినా ముందుగా మొక్కుకునేది సత్తెమ్మ తల్లినే. అందుకు నిదర్శనాలు ఉన్నాయని స్థానికులు చెబుతారు ఏ శుభకార్యం తల పెట్టినా ముందుగా సత్తెమ్మ తల్లిని దర్శించుకుని పనులు ప్రారంభిస్తారు. తొలి శుభలేఖను అమ్మవారికి సమర్పి స్తారంటే ఎంత మహిమో తెలుస్తుంది. రోడ్డు వెంబడి వెళ్లే వారు గుడి వద్ద తప్పనిసరిగా ఆగి డిబ్బిలో కాను కలు, సొమ్ములు వేస్తే గాని ముందుకు సాగరు. గుడి పక్కనే ఉన్న చెట్టు వద్ద కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కుబడులను తీర్చుకుంటారు. మిగతా రోజులోనూ ప్రత్యేకంగా ఆషాడ మాసం, మంగళ, ఆదివారాలలో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కు వగా ఉంటుంది. సత్తెమ్మ తల్లికి చరిత్ర ఉంది. పూర్వం రాత్రి వేళల్లో రైతులకు పొలాల్లో తెల్లని బట్టలతో ఉన్న ముసలావిడ గజ్జల శబ్దాలతో కనపడి సహాయం చేసి మాయమయ్యేదట. అం దుకే సత్తమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా పిలుస్తూ ఉంటారని అం టారు. పకృతి ఉట్టిపడే పచ్చని కొబ్బరి చెట్లు, పంటచేల మధ్య ముమ్మిడివరం మండలం, గున్నేపల్లి వద్ద 1974లో గుడి నిర్మించి సత్తెమ్మ తల్లి వారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ తల్లి క్షేత్రం భక్తుల నమ్మకంతో దిన దినాభివృద్ధి చెందుతోంది. మహి మాన్విత తల్లిగా, మహా పట్టున్న అమ్మగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతీయులు అమలాపురం-ముమ్మిడివరం మధ్యన ఉన్న మహిపాల చెరువు సెంటర్లో దిగి పల్లంకుర్రు రూట్ లోని కిలో మీటర్ లోపు దూరంలో గున్నేపల్లి సత్తెమ్మ తల్లిని చేరుకోవచ్చు.


