మహాశివరాత్రికి పటిష్ట బందోబస్తు.. సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా
కోనసీమ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు పనిచేస్తున్నారని, సోషల్ మీడియా వేదికగా అశాంతి రేకెత్తించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. ఆయన జిల్లా పర్యటనలో భాగంగా అయినవిల్లి, అమలాపురం పోలీస్ స్టేషన్లను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు.సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కారం:
ప్రజల సమస్యలు పెద్దవి కాకముందే వాటిని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని ఐజీ తెలిపారు. కోనసీమ సున్నితమైన ప్రాంతం కావడంతో జిల్లాలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగిస్తున్నామన్నారు.సోషల్ మీడియా అడ్మిన్లే బాధ్యులు:జిల్లాలో ఆవేశాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని ఐజీ స్పష్టం చేశారు. గ్రూప్ అడ్మిన్లకు ఇప్పటికే నిబంధనలు తెలియజేశామని, పాత వీడియోలను షేర్ చేసి కొత్తగా సమస్యలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాను నిరంతరం ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.
మహాశివరాత్రికి పటిష్ట ఏర్పాట్లు:రానున్న మహాశివరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంతంగా జరుపుకునేలా అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టామన్నారు. అంతర్వేది సహా ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద భద్రత విషయంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను ఐజీ అభినందించారు.
నేర నియంత్రణకు హైటెక్ నిఘా:జిల్లాలో పేకాట, కోడిపందేల వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నట్లు ఐజీ వెల్లడించారు. హై ప్రైయారిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చూస్తున్నామని చెప్పారు.సీనియర్ సిటిజన్లే టార్గెట్
సైబర్ నేరగాళ్ళు సీనియర్ సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని, దీనిపై ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. బ్యాంక్ మేనేజర్లు కూడా అనుమానాస్పద లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఖాతాదారులతో మాట్లాడి క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, అమలాపురం డి ఎస్పీ టి ఎస్ ఆర్ కె ప్రసాద్, సీఐ లు ప్రశాంత్ కుమార్, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.


