Listen to this article

జనం న్యూస్ 05 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా

ఈ నెల 07.02.2026 న పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణపూర్ గ్రామం లో నిర్వహించనున్న గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భారీ బహిరంగ సభను పురస్కరించుకుని, జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్ర, IPS నేడు సభా ప్రాంగణాన్ని మరియు పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ సభ నిర్వహించనున్న స్థలం, ప్రముఖులు కూర్చునే డి-రింగ్ భద్రతా ప్రాంతం, ప్రజలు కూర్చునే విభాగాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, అత్యవసర వాహనాల రాకపోకల మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి గారి రాక కోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించి, భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సభకు హాజరయ్యే అశేష జనవాహినిని దృష్టిలో ఉంచుకుని వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, పాదచారుల సౌకర్యాలు, బారికేడింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్, అంబులెన్సులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బందోబస్తు స్కీమ్‌పై స్థానిక పోలీస్ అధికారులు మరియు ఇతర విభాగాలతో సమీక్ష నిర్వహించి, శాంతిభద్రతల పరిరక్షణ, గుంపు నియంత్రణ వంటి అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. ప్రతి అధికారి పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయంతో కలసి పని చేయాలని స్పష్టం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా, విజయవంతంగా ముగిసేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ B. రాములు నాయక్, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ నర్సింగ్ యాదయ్య, DCRB డీఎస్పీ జానయ్య, డీటీసీ డీఎస్పీ శ్రీనివాసులు, ఏ.ఆర్ డీఎస్పీ వీరేష్, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.