జనం న్యూస్: ఫిబ్రవరి 7 (రిపోర్టర్: కొత్తమాసు అజయ్ కుమార్: యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా).
ప్రకాశం జిల్లా ఒంగోలు లోని గనులశాఖలో అవినీతి తిమింగలం గుట్టురట్టు చేసిన అవినీతి నిరోదక శాఖ.ప్రకాశం జిల్లా ఒంగోలులోని గనుల శాఖ ఉప సంచాలకుల కార్యాలయంలో సర్వేయర్-2గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ అక్రమాస్తులపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏసీబీ నెల్లూరు డీఎస్పీ రామచంద్రుడు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అయిదు బృందాలతో తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం వరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో సుమారు ఆరుకోట్ల విలువైన స్థిర, చరాస్తులను అధికారులు గుర్తించారు. అబ్దుల్ ఆసిఫ్ ప్రస్తుతం ఒంగోలులో పనిచేస్తుండగా.. ఆయన స్వస్థలమైన మార్కాపురంతో పాటు కనిగిరి మరియు గతంలో పనిచేసిన నెల్లూరు, గుంటూరుతో పాటు ప్రస్తుతం అతని కుటుంబం నివాసముంటున్న విజయవాడలోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆసిఫ్‌ను ఒంగోలులో అదుపులోకి తీసుకుని విజయవాడలోని ఆయన నివాసానికి తీసుకెళ్లి మరీ తనిఖీలు చేపట్టారు. రెండు రెసిడెన్షియల్ ఫ్లాట్లు, ఒక ప్లాటు, 22 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.2.82 లక్షల నగదు, 620 గ్రాముల బంగారు ఆభరణాలు, అరకేజీ వెండి వస్తువులు, రూ.3.54 లక్షల విలువైన ప్రామిసరీ నోట్లు, 16 వాచీలు, రూ.15 లక్షల విలువైన బీమా పత్రాలను గుర్తించారు. ఒక కారు కొనుగోలు చేసేందుకు అడ్వాన్స్ చెల్లించినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది.


