

జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : విజయనగరం, ఫిబ్రవరి 8: సూఫీ అధ్యాత్మిక చక్రవర్తి, హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలీ (ర.అ.) వారి 66వ సూఫీ సుగంధ సుమహోత్సవాలు శనివారం బాబామెట్ట దర్గా, దర్బార్ షరీఫ్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు శనివారం ఉదయం 6 గంటలకు పవిత్ర ఖురాన్ షరీఫ్ పఠనంతో ఉరుస్ మహోత్సవాలు మొదలయ్యాయి. అనంతరం ఖాదర్ బాబా దర్భార్ నుంచి ఆయన ప్రియ శిష్యులు హజరత్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదర్ బాబా వారి సూఫీ ఆధ్యాత్మిక వారసులు చీమలపాడు దర్గా పీఠాధిపతి మొహమ్ముద్ ఖ్వాజా మోహియునుద్దీన్ షా తాజ్ ఖాదరి, విజయనగరం సూఫీ దర్గా, దర్బార్ షరీఫ్ ముతవల్లి డా. మొహమ్ముద్ ఖలీలుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ నేత్రుత్వంలో అశేష బాబా భక్తులు, ప్రేమికులతో కలిసి ఫకీర్ మేళా, డప్పు వాయిద్యాలతో మెట్టపై ఉన్న ఖాదర్ బాబా దర్గాకు ఊరేగింపుగా వెళ్లి బాబా దివ్య సమాధికి సుగంధ పరిమళ ద్రవ్యాలను, పూలు, గజమాలలుతో చాదర్ సమర్పణ గావించారు. విశ్వ శాంతి కోసం ప్రత్యేక ప్రార్ధనలు చేసి దర్గా సన్నిధిలో జెండా స్థాపన చేసి ఉరుసు మహోత్సవాలను ప్రార్థనలతో ఘనంగా ప్రారంభించారు. అనంతరం భారీగా తరలి వచ్చిన భక్తుల కోసం దర్బార్ లో ఏర్పాటు చేసిన బారీ లంగర్ ఖానాలో దివ్య అన్న సమారాధనను ఖ్వాజా బాబా ప్రారంభించి అన్న ప్రసాదాన్ని అందించారు. ఈ సందర్బంగా సూఫీ పీఠాధిపతి సజ్జాద నషీన్ ముహమ్మద్ ఖాజా మోహియుద్దీన్ షా ఖాదరి భక్తులనుద్దేశించి మాట్లాడుతూ ఉరుసులో ప్రధాన ఘట్టం ఆదివారం జరుగుతుందని తెలిపారు. ఖాదర్ షా వారు జీవించి ఉన్న కాలంలో చిత్రీకరించిన ఆయన చిత్ర పటాన్ని చాదర్, పూలు, సుగంధ ద్రవ్యాలతో ఒక ప్రత్యేక వాహనంపై ఉంచి నషాన్, చాదర్, సందల్ షరీఫ్ లతో, ఫకీర్ మేళా ఖవ్వాలీలతో దర్బార్ షరీఫ్ నుంచి నగర పుర వీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం అశేష భక్తుల కోసం భారీ లంగర్ ఖానాలో దివ్య అన్న సమారాధన అర్ద రాత్రి వరకు నిర్వీరామంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం చాదర్ సమర్పణ, దస్తార్ బందీ, భక్తులకు తబరుక్ ప్రసాదాల పంపిణీ, సలామ్ ఖుల్ షరీఫ్ కార్యక్రమాలతో ఉరుసు ఉత్సవాలు ముగుస్తాయని ఖాజా బాబు తెలిపారు.ఖాదర్ బాబా ఆధ్యాత్మిక విప్లవ కారుడు : సజ్జదా నషీన్ ఖ్వాజా మోహియునుద్దీన్
భారత్ దేశంలో 850 ఏళ్ళ క్రితం హజరత్ బాబా ఖ్వాజా మోహియునుద్దీన్ ద్వారా సూఫీ సంప్రదాయమనే ఆధ్యాత్మిక విప్లవం వచ్చిందని ఆ మార్గంలో ఉద్భవించిన అధ్యాత్మిక విప్లవకారుడు హజరత్ బాబా ఖాదర్ వలి అని కీర్తించారు. ఆయన ద్వారా 1900 నుంచి 1961 వరకు విజయనగరంలో అధ్యాత్మిక విప్లవం పురుడుపోసుకుందన్నారు. ఈ ఆధ్యాత్మిక విప్లవం ద్వారా ఖాదర్ బాబా అనేక మంది ముస్లిం, ముస్లిమేతరులను సూఫీ పరంపర వారసులుగా తీర్చిదిద్దారని అన్నారు. అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తిని ఫరీద్ మస్తాన్ అవులియాగాను , ఖమ్మంలో బెల్లంకొండ లక్ష్మి నారాయణను బాబా అజీమ్ ఖాన్ గా, మారుమూల కృష్ణా జిల్లా చీమలపాడులో ఒక బాలుడిపై తన కృపా కటాక్షాల నుంచి అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబాగాను తయారు చేసారని అన్నారు. విజయనగరం ఖాదర్ బాబా దర్గా విశ్వ శాంతికి నిలయమని, జాతీయ సమైక్యతకు చిరునామా అని, ప్రేమ, సత్యం, దయ అనే అధ్యాత్మిక పునాదు రాళ్లతో ఈ పుణ్య క్షేత్రం నిర్మితమైందని అన్నారు.