

జనం న్యూస్ 09 ఫిబ్రవరి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల్ జిల్లా శనివారం ధరూర్ మండలంలోని మార్లబీడు గ్రామంలో ఉన్న కేటీ దొడ్డి జేపీటిబీసిడబ్ల్యూఆర్ఇఎస్ బాలుర పాఠశాలలో విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి బస చేసి, ఉదయం విద్యార్థులతో కలిసి దినచర్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మెనూ ప్రకారం ఈరోజు విద్యార్థులతో..కలిసి బూస్ట్ తాగారు. పాఠశాలలో ఉదయం విద్యార్థులతో పరస్పర సంభాషణ నిర్వహించి,తరగతి గదులు, రిజస్టర్స్, మెనూ, హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలంటే క్రమశిక్షణ, ప్రయత్నం, తమపై విశ్వాసం ఉండాలని అన్నారు. లక్ష్యాలను సాధించేందుకు నిరంతర కృషి చేయడం అవసరం అని తెలిపారు. చదవడమే కాకుండా, దాని అసలైన అర్థాన్ని, ప్రాముఖ్యతను పూర్తిగా గ్రహించాలని, భవిష్యత్తులో ఆ జ్ఞానం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలని సూచించారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు లాజికల్ ఆలోచనను అభివృద్ధి చేసుకుంటూ చదవాలని, రివిజన్ చేయడంతో పాటు మోడల్ పేపర్ల సహాయంతో ప్రాక్టీస్ కొనసాగించాలని అన్నారు. ఉదయం మరియు రాత్రి స్టడీ అవర్స్‌ను పూర్తిగా ఉపయోగించుకుని చదువుపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. విద్య మాత్రమే కాకుండా,శారీరక ఆరోగ్యాన్ని కూడా అభివృద్ధి చేయాలని, అందుకోసం విద్యార్థులంతా ప్రతిరోజూ వ్యాయామం చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకొని అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. పాఠశాలలో హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపాల్ లకు శోకాజ్ నోటీసులు జారీ చేసి, ఆహార నాణ్యత పర్యవేక్షణలో జరిగిన లోపాలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు తగిన ఆహారం అందించడంలో జాప్యం, నాణ్యత లోపం ఉన్నందుకు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మెనూకు అనుగుణంగా విద్యార్థులకు పోషకాహారం తప్పనిసరిగా అందించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరు నమోదును రిజిస్టర్ ను పరిశీలించి, విద్యార్థులు తరచుగా పాఠశాలకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. పాఠశాల పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తల్లిదండ్రుల కృషిని వృథా చేయకుండా చదువుపై పూర్తి దృష్టి సారించాలని, ప్రతి విద్యార్థి తనకు తాను రోల్ మోడల్‌గా నిలిచేలా ప్రయత్నించాలని కలెక్టర్ మార్గదర్శనం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది, పాల్గొన్నారు జారీచేయువారు:-డిపిఆర్ఓ, జోగులాంబ గద్వాల జిల్లా.