Listen to this article

జనం న్యూస్ -ఫిబ్రవరి 14- నాగార్జునసాగర్ టౌన్ –

అంతర్జాతీయ పర్యాటక కేంద్రం అయిన నాగార్జునసాగర్ ను శనివారం నాడు నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్ జి. రమేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. నాగార్జునసాగర్ లోని విజయ విహార్ అతిథి గృహానికి చేరుకున్న వీరికి పెద్దవూర విద్యాశాఖ అధికారి తరి రాము, ప్రోటోకాల్ ఆఫీసర్ దండ శ్రీనివాస్ రెడ్డి, విజయ విహార్ మేనేజర్ కిరణ్ లు ఘనంగా స్వాగతం పలికారు. సాగర్ సందర్శనలో భాగంగా టూరిజం లాంచీలో నాగర్జున కొండను మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల పూర్వ విద్యార్థి కావడంతో తన కుటుంబ సభ్యులకు తాను చదువుకున్న తరగతి గదిని,నివాసమున్న రూమును, భోజనశాలను చూపించి పాత రోజులను గుర్తు చేసుకున్నారు. అనంతరం బుద్ధవనం చేరుకొని బుద్ధ చరితవనం,ధ్యానవనం, మహాస్తుపాన్ని సందర్శించారు. వీరికి బుద్దవనం అధికారులు బుద్దవనం కండువాలతో, బ్రోచర్లతో సత్కరించారు. వీరికి నాగార్జునసాగర్ డ్యాం, నాగార్జున కొండ మ్యూజియం, బుద్ధవనం విశేషాలను స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ వివరించారు. వీరితోపాటు టూరిజం అధికారులు, స్థానిక పోలీసులు తదితరులు ఉన్నారు.