మంచనపల్లి శ్రీనివాస్ జాతీయ అంబేడ్కర్ అవార్డ్
జనం న్యూస్ 18 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా
దళిత ఆత్మగౌరవ పతాక, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు. 1906-1933 మధ్య హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి , వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేస్తూ, జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేసిన సంఘ సంస్కర్త, దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ గారి వర్ధంతి సందర్భంగా.దళితులు పంచములు కాదు.. ఆది హిందువులు అంటూనే జోగిని, దేవదాసి వంటి దురాచారాలను రూపుమాపేందుకు ఉద్యమించారు. మన్యం సంఘాన్ని స్థాపించి దళితుల్లో చైతన్యం తెచ్చారు. జగన్ మిత్ర మండలి పేరిట దళిత బాలబాలికలకు విద్య నేర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారు. పలు సేవా కార్యక్రమాలతో దళిత జనోద్ధారకుడిగా, సంఘ సంస్కర్తగా, వైతాళికుడిగా నిలిచారు.. భాగ్యరెడ్డి వర్మ. మాదరి భాగయ్యగా జన్మించి.. సమాజ సేవా కార్యక్రమాలతో భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందిన ఆయన వర్ధంతి ఈ రోజు..నిజాం పాలిత హైదరాబాద్ రాజ్యంలో అనగారిన వర్గాల గొంతుక భాగ్యరెడ్డి వర్మ.. 1888 సం. మే 22 నాడు మాదిరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు జన్మించారాయన.. తొలిపేరు భాగయ్య.. అయితే వారి కుల గురువు భాగ్యరెడ్డి అనే పేరు పెట్టారు.. (రెడ్డి అంటే పాలకుడు అనే అర్థం కూడా ఉంది) చిన్నప్పటి నుండి సామాజిక స్పృహను అలవరచుకున్న భాగ్యరెడ్డిపై ఆర్యసమాజం, బ్రహ్మసమాజం, బౌద్ధం ప్రభావం కూడా ఉంది. అంటరానితనం, దేవదాసీ వ్యవస్థ, మద్యపానం తదితర రుగ్మతలపై పోరాటాలు చేయడమే కాదు, స్వయంగా దళితులకు విద్య, ఉపాధి, సామాజిక హోదాల కోసం తన వంతు కృషి చేశారు.బాగయ్య చిన్నప్పటి నుంచే చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చేవాడు. వీరి ఇంటికి శైవమత గురువు తరుచూ వచ్చి బోధనలు చేసేవారు. ‘ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినారు. వీరు రాక ముందు నేడు అంటరానివారుగా చూడబడుతున్న దళితులు పాలకులుగా వుండేవారు. ‘ రెడ్డి’ అన్న పదం రేడు నుండి వచ్చింది. దీనికి అర్ధం పాలకులు’ అని ఆయన చెప్పేవాడట. ఇది బాగయ్య మనసులో ఎంతగా నాటుకు పోయిందంటే, ‘మా పూర్వీకులు పాలకులే కదా! నేను పాలకుడిని ఎందుకు కాకూడదు’ అని ఆయన తన పేరు చివరన రెడ్డిని చేర్చుకున్నాడు. అట్లా బాగయ్య భాగ్యరెడ్డిగా మారాడు. ఆ తరువాత 1913లో ‘ఆర్య సమాజ్’ వార్షిక సదస్సులో ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ‘వర్మ’ అన్న బిరుదును ప్రధానం చేశారు. దాంతో ఆయన భాగ్యరెడ్డి వర్మగా గుర్తింపు పొందారు.బాగయ్య యుక్త వయసులోనే ఉద్యమాలను, సంస్థలను స్థాపించిన దీర్ఘదర్శి. 1906లో జగన్ మిత్రమండలి, 1911లో మన్యసంఘం, 1922లో ఆది జన జాతియోన్నతి సభ (దీనినే “ఆది హిందూ జాతియోన్నతి సభ” అని కూడా పిలుచుకునేవారు.), 1932లో “స్వస్తదళ్”ను ఏర్పాటు చేశారు. వీటికి ఆయన కార్యనిర్వాహకులుగా ఉన్నప్పటికీ తనతో పాటు అరిగె రామస్వామి, వాల్తాటి శేషయ్య, వెంకటరామ్, జే.హెచ్.సుబ్బయ్య, ముదిగొండ లక్ష్మయ్య, ముత్తయ్య, శివరామ్, పులి నర్శింలు లాంటి ప్రముఖులు చురుగ్గా పాల్గొనేవారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో వీరు చేపట్టే కార్యక్రమాలు కూడా ఎన్నో విధాలా ఆసక్తి రేకెత్తించేవి.ఆధిపత్య కులాల వారు నిర్వహించే కార్యక్రమాలకు మాల, మాదిగ లను ఆ కాలంలో రానిచ్చేవారు కాదు. అందుకే భాగ్యరెడ్డి వర్మ సభలు, సమావేశాల సందర్భంలో హరికథలను నిర్వహించేవారట. అస్పృశ్యతను పాటించే వైదిక ధర్మానికి, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన బౌద్ధ ధర్మాన్ని పాటించేవారు. వీరు వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధ జయంతిని ఘనంగా నిర్వహించేవారు. హరికథా కార్యక్రమాల ప్రారంభంలోను, ముగింపు సమయంలోను భాగ్యరెడ్డి వర్మ దళితుల నుద్దేశించి అనర్గళంగా ప్రసంగించేవారు. “దళితులే ఈ దేశపు మూలవాసులు. అంటరానితనంను పాటించే ఆదిపత్య కులాలవారు పొట్ట చేతవట్టుకొని మధ్యఆసియా నుండి వలస వచ్చినవారు. అవిద్య, అజ్ఞానం వల్ల మాత్రమే దళితులు వెనకబడి ఉన్నారు” అని ఆయన బోధించేవారట. దక్కన్‌లో భాగ్యరెడ్డి వర్మ తరం నిర్మించిన ఆదిజన ఉద్యమం దేశవ్యాపితంగా నడిచిన ఆదిజన మూలవాసీ ఉద్యమానికి అనుసంధాన కర్తగానూ పనిచేసింది. ఇందులో భాగంగానే 1917లో నిర్వహించిన ‘ఆది ఆంధ్ర సభ’లో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షోపన్యాసం చేయడం చారిత్రాత్మకం. భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన భాగ్యనగర్ అనే పత్రికలో సాహిత్యంలో తొలిసారిగా తాను రాసిన నవల వెట్టి మాదిగ సాహిత్యాన్ని తానే తొలిసారి ప్రచురించాడు. వర్మ రాసిన ఆ నవల గురించి ప్రజలకు అంతగా తెలియదు.బేద్కర్ కన్నా ముందే దేశ వ్యాప్తంగా దళితులకు అనాదిగా జరుగుతున్న అన్యాయాలపై గొంతెత్తిన మహానాయకుడు భాగ్యరెడ్డి వర్మ.. తదనంతర కాలంలో బాబా సాహెబ్ తో కలసి ఉద్యమాల్లో పాల్గొన్నారు ‘ మేము పంచములం కాదు.. ఈ దేశ మూల వాసులం.. ఆది హిందువులం..’ అని సగర్వంగా చాటారు.. అనగారిన కులాలను ఆది హిందువులు అని పిలవాలని పిలుపునిచ్చారు. భాగ్యరెడ్డి వర్మ సూచన మేరకు హైదరాబాద్, మద్రాసు ప్రభుత్వాలు వారిని ఆది హిందువులుగా గుర్తించాయి. 1910లో చాదర్ఘాట్ దగ్గర ఆది హిందూ పాఠశాల ప్రారంభించారు. మహాత్మా గాంధీ ఈ పాఠశాలను సందర్శించారు. కాలక్రమంలో ఆది హిందూ పాఠశాలలు 26కు విస్తరించాయి.భాగ్యరెడ్డి వర్మ సేవలు హైదరాబాద్ (తెలంగాణ) సంస్థానానికే పరిమితం కాలేదు.. 1917లో విజయవాడలో అంటరాని కులాల సదస్సును నిర్వహించారు. ఆంధ్ర జిల్లాల్లో కూడా పర్యటించి అనగారిన వర్గాల్లో చైతన్యం తీసుకు వచ్చారు. లక్నో, అలహాబాద్, కలకత్తా తదితర ప్రాంతాల్లో జరిగిన దళిత చైతన్య మహాసభలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.. భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో కన్నుమూశారు. 51 ఏళ్లకే ఆయన అకాల మరణంతో ఆది హిందూ ఉద్యమం, అనగారిన వర్గాల అభివృద్ధి, అభ్యున్నతికి విఘాతం కలిగించింది. భాగ్యరెడ్డి వర్మ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను గుర్తు చేసుకుందాం.


