

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 10 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️రాష్ట్ర ప్రభుత్వం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతికి రూ.50 లక్షలు కేటాయించడం పట్ల ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు బి.శ్రీను నాయక్ అన్నారు.సోమవారం పట్టణంలో ఎన్నార్టీ సెంటర్లోని గల సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి మహర్షి,కనక దాసు, వడ్డే ఓబన్న జయంతిలను అధికారికంగా అన్ని జిల్లాల్లో నిర్వహించిందని, అదేవిధంగా ఫిబ్రవరి 15 తేదీన సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. సెలవు దినంగా ప్రకటించే విధంగా ఆలోచన చేయాలన్నారు. సుగాలి ప్రజల అత్యంత ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతిని రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హర్యానా, గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారన్నారు. ప్రభుత్వం ఈ విషయాల పైన దృష్టి సారించి సుగాలి ప్రజల మనోభావాలను దెబ్బ తినకుండా అన్ని జిల్లాల్లో ప్రణాళికలు రూపొందించాలన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన ఎస్టీ ఎం.పీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు సేవాలాల్ జయంతి పైన దృష్టి సారించాలన్నారు.