Listen to this article

జనం న్యూస్ జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలంలోని

మంగేల గ్రామ సమీప ప్రాంతాల్లో హైనా (దుప్పిలి) సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. గత కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో వన్యప్రాణి కదలికలు ఉన్నట్లు అందిన సమాచారంతో అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అది హైనాగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ధర్మపురి అటవీ క్షేత్ర అధికారి శ్రీనాథ్ గ్రామ ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. గ్రామ ప్రజలు, ముఖ్యంగా అటవీ ప్రాంతం సమీపంలో ఉండేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరూ కూడా అటవీ ప్రాంతంలోకి లేదా నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లరాదని సూచించారు. పశువులను మేపే సమయంలో కాపరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గుంపులుగా ఉండాలని కోరారు. పొలాల చుట్టూ అక్రమంగా విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయకూడదని, దీనివల్ల వన్యప్రాణులతో పాటు మనుషులకు కూడా ప్రాణాపాయం ఉంటుందని హెచ్చరించారు. హైనా సంచారానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా లేదా అది ఎక్కడైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్ బేసిక్ క్యాంప్ అధికారులకు సమాచారం అందించాలని శ్రీనాథ్ కోరారు. ప్రజలు భయాందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.