Listen to this article

జనం న్యూస్ 23 ఫిబ్రవరి 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

సీపీఐ ఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపు పార్లమెంటులో చర్చలు లేవు.. ఏకపక్ష నిర్ణయాలే పరమావధి!ఉపాధి హామీ రద్దు, లేబర్ కోడ్స్ తీసుకురావడం దుర్మార్గం.నాగర్ కర్నూల్ ఘటనపై సి.ఐ, ఎస్.ఐ లపై హత్య నేరం నమోదు చేయాలి.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మార్చి 1 నుండి నిర్వహించబోయే రాష్ట్రవ్యాప్త క్యాంపెయిన్‌లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలో జి.రాజు అధ్యక్షతన జరిగిన సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ, పార్లమెంటులో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని విమర్శించారు.గ్రామీణ పేదలకు కొండంత అండగా ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని అఖిలపక్షాలతో చర్చించకుండా ఏకపక్షంగా రద్దు చేసి, ‘వికసిత్ భారత్ జి రాంజీ’ బిల్లును ఆమోదించుకోవడం పేదల పొట్ట కొట్టడమేనన్నారు. విద్యుత్ సవరణ బిల్లు ద్వారా పేదలకు అందే సంక్షేమ పథకాలను దూరం చేస్తున్నారని, విత్తన సవరణ బిల్లుతో వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ వారితో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకురావడం ద్వారా కార్మికులను బానిసలుగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపుతూ కాలయాపన చేస్తోందని విమర్శించారు.నాగర్ కర్నూల్ ఘటనపై డిమాండ్ నాగర్ కర్నూల్ జిల్లాలో దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై అగ్రకుల అహంకారంతో దాడి చేసి, చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన ఎస్సై (యస్ ఐ), సి.ఐ (సి ఐ ) లపై హత్య నేరం కింద కేసులు నమోదు చేయాలని, బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ శ్రీరామ్ నాయక్, సీనియర్ నాయకులు కిల్లె గోపాల్, జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి, జిల్లా కమిటీ సభ్యులు పరంజ్యోతి, వి.వి. నరసింహ, ఉప్పేర్ నరసింహ, నర్మద మరియు మండలాల నాయకులు ఈశ్వర్, ఎం. వెంకటేశ్వర్లు, మధు, అలీ అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
ఏ. వెంకటస్వామి జిల్లా కార్యదర్శి,సీపీఐ ఎం, జోగులాంబ గద్వాల జిల్లా.