జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఫిబ్రవరి 24 సెల్ 9550978955
రెండేళ్ల క్రితం భర్త మృతి ఇప్పుడు కొడుకుకు ప్రాణాపాయం
నా బిడ్డను కాపాడండి అంటూ చేతులెత్తి మొక్కుతున్న రమాదేవి
చిలకలూరిపేట, ఫిబ్రవరి విధి ఆ కుటుంబంపై పగబట్టింది. రెండేళ్ల క్రితమే ఇంటి యజమానిని కోల్పోయి తీరని శోకంలో ఉన్న ఆ తల్లికి, ఇప్పుడు కన్నకొడుకు రూపంలో మరో పెను ప్రమాదం ముంచుకొచ్చింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ పేద కుటుంబం ఇప్పుడు ప్రాణభిక్ష కోరుతోంది. తనకొచ్చిన కష్టం ఏ తల్లికీ రాకూడదని విలపిస్తున్న ఆ మాతృమూర్తి వేదన ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది.ఒక్కొక్కటిగా చుట్టుముట్టిన కష్టాలు చిలకలూరిపేట పట్టణం ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్న గుంటూరు రమాదేవి (45) ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితం ఆమె భర్త మరణించడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. పాచి పనులు చేస్తూ, చాలీచాలని సంపాదనతోనే తన కూతురు భవానికి గతేడాది వివాహం జరిపించి బాధ్యత నెరవేర్చుకుంది. అయితే, ఈ లోపే విధి ఆమెను మరోసారి దెబ్బతీసింది. ఆమె కుమారుడు సాయి (22) గత ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురికాగా, పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తేల్చారు.డయాలసిస్‌తో పోరాటం ప్రస్తుతం సాయికి వారానికి రెండుసార్లు గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ నిర్వహిస్తున్నారు. కిడ్నీ మార్పిడి చేయకపోతే సాయి బ్రతకడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పారు. తన కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి తల్లి రమాదేవి తన కిడ్నీని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. సాయం కోసం ఎదురుచూపు స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 15 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే, ఆపరేషన్ మరియు తదుపరి చికిత్సల కోసం మరో 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇంత పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడం ఆ పేద తల్లి వల్ల కావడం లేదు.ఈ నేపథ్యంలో చిలకలూరిపేట పట్టణంలోని నాయి బ్రాహ్మణ సేవా సమితి వారు మానవత్వం చాటుకున్నారు. తమ అసోసియేషన్ తరఫున లక్ష రూపాయలు వసూలు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు.దయ హృదయాలకు విన్నపం నా బిడ్డ ఇంకా నూరేళ్లు బ్రతకాలి.. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి నా కొడుకును కాపాడండి” అంటూ రమాదేవి రెండు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. ఆమె పడుతున్న ఆవేదనను చూసి స్థానికులు కన్నీరు పెడుతున్నారు. ఆపదలో ఉన్న ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఉదారత కలిగిన దాతలు తమ వంతు సాయం అందించాలని కోరుతున్నారు.
దాతలు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 📞 9701050765


