జనంన్యూస్.25నిజామాబాద్,శ్రీనివాస్ పటేల్.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపాల్ లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 40 బడులకు పీఎం శ్రీ పథకం కింద నిధులను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. వీటిని వెచ్చిస్తూ ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేలా చొరవ చూపాలని కలెక్టర్ అన్నారు. అవసరమైన చోట తరగతి గదులు మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్లే గ్రౌండ్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే పలు పాఠశాలలో పనులు జరగగా, మిగతా బడులలో వెంటనే అవసరమైన పనులు గుర్తిస్తూ తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పి.ఎం శ్రీ నిధులు వెనక్కి మళ్ళి పోకుండా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. కాగా పీఎం శ్రీ నిధుల వినియోగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి దేవేందర్ కుమార్ రాయ్ నేతృత్వంలోని బృందం ఈనెల 27, 28 తేదీలలో జిల్లాలో పర్యటించనుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



