జనం న్యూస్ ఫిబ్రవరి 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
ఇటీవల విశాఖపట్నంలోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన 9వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ – 2026 లో అనకాపల్లి జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ జి.శ్రీనివాసరావు (PC 1958) రజత పతకం సాధించి జిల్లా పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానం వద్ద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆయనను ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు. ఫిబ్రవరి 23, 2026న జరిగిన పోటీల్లో ‘మాస్టర్స్ కేటగిరీ’లో శ్రీనివాసరావు రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. శ్రీనివాసరావు 2009 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆర్మ్డ్ రిజర్వ్ కైలాసగిరి, విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూనే, జిల్లా పోలీస్ జిమ్ టైనర్‌గా అధికారులు మరియు సిబ్బందికి తర్ఫీదునిస్తున్నారు.ఈయన ఇప్పటివరకు 25 సార్లు ‘మిస్టర్ ఆంధ్ర’గా నిలిచారు. 2012లో ‘మిస్టర్ ఇండియా’ రజత పతకం, 2013లో ‘మిస్టర్ సౌత్ ఇండియా’ గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహిస్తూనే క్రీడల పట్ల అంకితభావంతో పనిచేయడం అభినందనీయమని కొనియాడారు. రానున్న ఆల్ ఇండియా పోలీస్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కు మరింత పకడ్బందీగా సిద్ధమై, జాతీయ స్థాయిలో విజయం సాధించి జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్,ఎల్.మోహన రావు, ఎస్.బి డీఎస్పీ జీ.ఆర్.ఆర్.మోహన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సంజీవరావు మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేశారు.


