Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి. వీరేశం జనం న్యూస్ జహీరాబాద్, మార్చ్ 1: 03 2026

జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం నాడు నిర్వహించిన 196 వ నగర సంకీర్తన అట్టహాసంగా జరిగింది. జహీరాబాద్ పట్టణంలోని సాయిరాం కాలనీలో శ్రీ కృష్ణ కీర్తనలతో శోభాయాత్ర జరిపిన అనంతరం ఆ కాలనీలో లోని కమ్యూనిటీ సెంటర్ లో ముందస్తు హోళీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఒకరిపై ఒకరు వివిధ రకాల పుష్పాలను వెదజల్లుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో రాధారాణి హోళీ పాటలను పాడుతూ నృత్యాలు చేశారు. ముందస్తు హోళీ వేడుకల సందర్భంగా భక్తులు రంగులు వేసుకుంటూ ఆనందంగా గీతాలు పాడుతూ తన్మయత్వంలో మునిగిపోయారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ విభిషణ్ ప్రభుజీ గౌర్ పౌర్ణమి సందర్భంగా శ్రీ చైతన్య మహాప్రభు జయంతి ఉత్సవాన్ని సైతం భక్తుల మధ్య నిర్వహించారు. చైతన్య ప్రభు ప్రతిమను పంచామృతాల ద్వారా అభిషేకించి పూజించారు.ఈ సందర్భంగా చైతన్య మహాప్రభు జీవిత చిత్రాన్ని వివరించారు. కలియుగంలోశ్రీ కృష్ణుడే చైతన్య మహా ప్రభు రూపంలో అవతరించినట్లు పేర్కొన్నారు. వేపచెట్టు కింద శచి దేవికి చైతన్య ప్రభు పసిడి వర్ణంతో జన్మించినట్లు తెలిపారు. ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున చైతన్య ప్రభు అవతరించిన నేపథ్యంలోనే గౌర్ పౌర్ణమి ఉత్సవం జరుగుతుందని వెల్లడించారు. అంతకు ముందు కృష్ణ కీర్తనలతో కాలనీలో అసాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా చిన్నారులు చేసిన భక్తి కేరింతలు కన్నుల విందు చేసింది.
హుగ్గెల్లి లోనూ ఘనంగా పల్లె సంకీర్తన జహీరాబాద్ మండలం హుగ్గెల్లి గ్రామంలోనూ ఆ గ్రామ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం పల్లె సంకీర్తన ఘనంగా జరిగింది. గ్రామస్థులంతా సాంప్రదాయ దుస్తులు ధరించి కృష్ణ భక్తి గీతాలను ఆలపిస్తు శోభయాత్ర జరిపారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో గౌర్ పౌర్ణమిని పురస్కరించుకొని చైతన్య మహాప్రభు జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. విభిషణ్ ప్రభు, చక్రధర్ ప్రభు లు చైతన్య ప్రభు ను అభిషేకించి కీర్తించారు.