Listen to this article

జనం న్యూస్, మార్చి 9 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి

సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న సామాజిక రుగ్మతలను నిర్మూలించాలంటే యువతలో మార్పు రావాలని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని తెలంగాణ ప్రభుత్వ భాషా–సంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులు దరువు అంజన్న పిలుపునిచ్చారు.మెదక్ జిల్లా తునికిలో నిర్వహిస్తున్న ప్రసిద్ధ నల్ల పోచమ్మ జాతర సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం టూరిజం మరియు భాషా–సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రభాతభేరి” కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాష్ట్ర టూరిజం మరియు భాషా–సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం సామాజిక అవగాహన కల్పించడమే లక్ష్యంగా కొనసాగుతోంది.ఈ సందర్భంగా కళాకారులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మద్యానికి బానిస కాకూడదని, బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులవ్వకూడదని, ఆర్భాటాల కోసం అప్పుల పాలవ్వకూడదని, మహిళలను గౌరవించాలని వంటి సందేశాలను పాటలు, నాటికలు, నృత్య ప్రదర్శనల రూపంలో ప్రేక్షకులకు అందించారు. ఈ సాంస్కృతిక ప్రదర్శనలు జాతరకు విచ్చేసిన భక్తులను ఆలోచింపజేసేలా సాగాయి.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, సమాజంలో చైతన్యం కలిగించే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించినందుకు భాషా–సాంస్కృతిక శాఖ సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.తునికి నల్ల పోచమ్మ జాతరలో నిర్వహించిన ప్రభాతభేరి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకోవడమే కాకుండా సామాజిక బాధ్యతపై అవగాహన కల్పించాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.