Listen to this article

మైనారిటీ రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి – విధుల నుండి కేర్‌టేకర్ వీణ తొలగింపు

జనం న్యూస్ మార్చి 09 : నిజామాబాద్ జిల్లా

బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయం మరియు మోడల్ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్, కిచెన్ తదితర విభాగాలను పరిశీలించి, నిల్వ ఉంచిన సన్నబియ్యం సహా ఇతర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతున్నదా అని ఆరా తీశారు.ఈ సందర్భంగా మోడల్ స్కూల్ కేర్‌టేకర్ ఎం. వీణ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థినులు మరియు సిబ్బంది కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ విద్యార్థినులతో ప్రత్యేకంగా సమావేశమై పూర్తి వివరాలు తెలుసుకున్నారు.కేర్‌టేకర్ విధులకు సక్రమంగా హాజరు కాకపోవడం, విద్యార్థుల బాగోగులు పట్టించుకోకపోవడం, మెనూ ప్రకారం భోజనం అందించకపోవడం, హాస్టల్‌లో నీటి కొరత ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వంటి విషయాలను విద్యార్థినులు వివరించారు. అదేవిధంగా కేర్‌టేకర్ పరుష పదజాలంతో దూషిస్తూ అనుచితంగా ప్రవర్తిస్తున్నారని సిబ్బంది కూడా కలెక్టర్ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు.
దీనిని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ వెంటనే విచారణకు ఆదేశించారు. జీఈసీఓ భాగ్యలక్ష్మి, ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌లు విచారణ జరిపి నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా కేర్‌టేకర్ వీణను విధుల నుండి తొలగిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని, విద్యార్థుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. మోడల్ స్కూల్‌లో ఉన్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు.అనంతరం కలెక్టర్ మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించారు. పదవ తరగతి గదిని సందర్శించి విద్యార్థినులకు గణితంలో ప్రశ్నలు వేసి వారి అభ్యాస సామర్థ్యాలను అంచనా వేశారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థినులను అభినందిస్తూ చాక్లెట్ బాక్సులు అందజేశారు.పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏకాగ్రతతో చదువుకొని ఉత్తమ గ్రేడ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థినులకు సూచించారు. గత సంవత్సరం 100 శాతం ఉత్తీర్ణత నమోదైందని ప్రిన్సిపాల్ తెలుపగా, ఈసారి కూడా శాతం ఫలితాలు వచ్చేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. త్వరలో మళ్లీ ఆకస్మిక తనిఖీకి వస్తానని, పాఠశాల నిర్వహణను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు.