

-సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్
జనం న్యూస్ 12 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : కూటమి ప్రభుత్వ ఎన్నికల హమీలో బాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం, ఇంటి నిర్మాణానికి 5లక్షలు హామీ అమలు చేసే వరకు భారత కమ్యునిస్టు పార్టీ ( సిపిఐ ) పోరుబాట కొనసాగుతుందని సిపిఐ విజయనగరం నియోజకవర్గ కార్యదర్శి బుగత అశోక్ తెలిపారు.మంగళవారం ఉదయం డి.ఎన్.ఆర్ అమర్ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పేదల ఇంటి స్థలం కోసం సిపిఐ పోరుబాట కార్యక్రమం ప్రచార గోడ పత్రిక విడుదల చేయడం జరిగింది. అనంతరం బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ గత ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణం కేవలం 1 సెంటు స్థలంలో ఇండ్లు నిర్ధిష్ట కాలవ్యవధిలో పూర్తి చేసుకోవలన్న షరతులకు బయపడి అధిక వడ్డీలకు అప్పు తెచ్చి ఇంటి నిర్మాణం పూర్తి కాకుండానే ఇండ్లును కోల్పోవలసి వచ్చిందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చే 1 లక్ష 80 వేల రూపాయలకి ఇంటి స్థలం, నిర్మాణ వ్యయం సరిపోదని నూటికి తొంబైశాతం ప్రజలు నిర్మాణం చేసుకోలేక పునాదులు వేసుకుని మరల ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు అని అన్నారు. ఇసుక, ఇటుక, ఇనుము, సిమెంటు మొదలైన ఇంటి నిర్మాణ సామాగ్రి వ్యయం అమాంతం పెరగడం ఇంటి నిర్మాణం చేసుకోలేకపోయారు అని అన్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీసర్వే చేయాలని, ఇల్లు నిర్మాణం చేయని పట్టాలు రద్దు చేయాలి అని నిర్ణయాన్ని సిపిఐ ఖండిస్తుంది అన్నారు. అలాంటి దుర్మార్గమైన నిర్ణయాలు చేయడం వలన చాలామంది లబ్ధిదారులు ఇళ్ళు కోల్పోతారు అని అన్నారు. దినసరి కూలీకి పోయి జీవనం సాగిస్తున్న సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలు సొంతంగా ఇంటి నిర్మాణం చేసుకోవాలంటే ఒక జీవిత కాలం సరిపోవడం లేదన్నారు. ప్రభుత్వాలు మారుతున్న జీవితంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలన్న సంకల్పం సాకారం కాక అధికారులు, పాలక ప్రభుత్వాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా ఫలితం దక్కడంలేదు అన్నారు. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం పక్కా గృహం మంజూరయ్యి కట్టుకొని లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు భారత కమ్యునిస్టు పార్టీ (సిపిఐ) పేదల పక్షాన నిలబడి దశల వారీగా పోరాటాలు చేస్తుంది అని తెలిపారు. ఈనాటి నుండి సిపిఐ నాయకత్వం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు రావడం జరుగుతుందని సొంత ఇల్లు లేని వాళ్ళకి అర్జీలు రాయడం జరుగుతుందని అని అన్నారు. ఆ అర్జీలను లబ్దిదారులతో కలిసి వెళ్ళి జిల్లా కలెక్టర్ గార్కి అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా జయప్రదం చేయాలని కోరారు.ఈ సమావేశంలో సిపిఐ కస్పా శాఖ కార్యదర్శి ఎస్ రంగరాజు, మార్క్స్ నగర్ శాఖా కార్యదర్శి అప్పరుబోతు జగన్నాధం, బలిజివిధి శాఖా కార్యదర్శి పొందూరు అప్పలరాజు, శాంతి నగర్ శాఖా కార్యదర్శి చిల్లా చిట్టిబాబు రెడ్డి, సిపిఐ విజయనగరం నియోజవర్గ సమితి నాయకులు పొడుగు రామకృష్ణ, వెలగాడ రాజేష్, పి. గౌరీ శంకర్, బూర వాసు తదితరులు హాజరయ్యారు.