Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,


జనం న్యూస్ 12 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం చిన బజారులో ఫిబ్రవరి 1న రాత్రి జరిగిన చోరీ కేసును చేధించి, చోరీకి సహకరించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, చోరీ చేసిన 45 తులాల బంగారు వస్తువులను రికవరీ చేసినట్లుగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఫిబ్రవరి 11న నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – బొబ్బిలి పట్టణంకు చెందిన జ్యూవలరీ షాపు యజమాని అయిన గ్రంధి రవి కుమార్ ఫిబ్రవరి 2న బొబ్బిలి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తన ఇంటి తాళం గుర్తుతెలియని వ్యక్తులు పగలగొట్టి, ఇంటిలోకి ప్రవేసించి, బంగారు వడ్డాణం, బంగారు గాజులు, బంగారు గొలుసులు, బంగారు బ్రాస్లెట్లు మరియు ఇతర బంగారు వస్తువులు (మొత్తం 45 తులాలు, విలువ రూ.10.50 లక్షలు) చోరీకి పాల్పడినట్లుగా తెలపగా, బొబ్బిలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ కేసును ఛాలెంజింగుగా స్వీకరించి, మిస్టరీని చేధించేందుకు బొబ్బిలి సిఐ కే.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
విచారణలో పలు ఆధారాలను సేకరించి, నిందితుల గురించి గాలింపు చర్యలు చేపడుతుండగా వచ్చిన సమాచారంతో (ఎ-2) బొబ్బిలి మండలం గున్నతోట వలసకు చెందిన పెంకి శ్రీనివాసరావు (37 సం.లు) (ఎ-3) పాత బొబ్బిలికి చెందిన బత్తుల సర్వేశ్వరరావు (32 సం.లు) (ఎ-4) ఎచ్చెర్ల మండలం ముద్ధాడ గ్రామానికి చెందిన ముద్ధాడ నరసింగరావు (33 సం.లు) అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి విచారణ చేసామన్నారు. విచారణలో నిందితులు పేకాట మరియు ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడినట్లు, ఈ క్రమంలో పాత నేరస్థుడు అయిన సీతానగరం మండలం, జోగింపేట గ్రామానికి చెందిన (ఎ-1) పోలా భాస్కరరావుతో పరిచయం అయినట్లు, దొంగతనాలు చేసేందుకు ఇల్లు చూపిస్తే, చోరీ చేసిన వస్తువుల్లో వాటా ఇచ్చేందుకు వీరి మధ్య ఒప్పందం కుదిరిందన్నారు. నిందితులు (ఎ-2) పెంకి శ్రీనివాసరావు (ఎ-3) బత్తుల సర్వేశ్వరరావు ఇరువురు పోలా భాస్కరరావుకు చోరీ చేసేందుకు ఫిర్యాది ఇంటిని చూపించగా, పలుమార్లు రెక్కీ నిర్వహించి, చివరకు ఫిబ్రవరి 1/2న రాత్రి (ఎ-1) పోలా భాస్కరరావు ఫిర్యాది ఇంటిలోకి ప్రవేసించి, దొంగతనంకు పాల్పడ్డారన్నారు. (ఎ-1) పోలా భాస్కరరావుకు పరిచయం ఉన్న పాత నేరస్థుడు అయిన (ఎ-4) ముద్దాడ నర్సింగరావు సహకారంతో దొంగిలించిన బంగారు వస్తువుల్లో కొన్నింటిని కరిగించి, కడ్డీలుగా మార్చినాడన్నారు. (ఎ-2) శ్రీనివాసరావు (ఎ-3) బత్తుల సర్వేశ్వరరావు మరియు (ఎ-4) ముద్దాడ నర్సింగరావులు
దొంగిలించిన వస్తువులను అమ్మేందుకు రాయగడ వెళ్ళేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారని జిల్లా ఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న (ఎ-1) పోలా భాస్కరరావు గురించి గాలిస్తున్నట్లు, అతడిని కూడా త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఎ-1 పోలా భాస్కరావుపై ఇప్పటికే 17 చోరీ కేసులు, ఎ-4 ముద్దాడ నర్సింగరావుపై 13 చోరీ కేసులు ఉన్నాయని, ఇరువురు పాత నేరస్తులేనని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన బొబ్బిలి ఇన్స్పెక్టర్ కే.సతీష్ కుమార్, ఎస్ఐ ఆర్.రమేష్ కుమార్, ఎఎస్ఐ బి.వి.రమణ, కానిస్టేబుళ్ళు ఎస్. రామారావు, యు.శ్రీరాములు, ఎస్.శ్రీహరి,అప్పారావు లను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.