Listen to this article

జనం న్యూస్ ; 14 మార్చ్ శనివారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై. రమేష్ ;

పదో తరగతి పరీక్షలు అనగానే విద్యార్థుల్లోనూ, తల్లిదండ్రుల్లోనూ కొంత ఆందోళన ఉండడం సహజమే. స్వల్ప ఒత్తిడి ఉంటే మెదడు చురుకుగా పనిచేసి చదివిన విషయాలు త్వరగా గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది.అయితే ఒత్తిడి ఎక్కువైతే ఆందోళన పెరిగి, తెలిసిన విషయాలే మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు విశ్రాంతి పద్ధతులను పాటించి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. పరీక్ష హాల్లోకి వెళ్లగానే రెండు నిమిషాల పాటు లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదిలే శ్వాస వ్యాయామం చేయాలి.ప్రశ్నాపత్రం తీసుకున్న తర్వాత దానిని పూర్తిగా జాగ్రత్తగా చదవాలి. బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాయాలి. దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కుల మేరకు మాత్రమే సమాధానం రాయాలి. అవసరం లేని విషయాలు ఎక్కువగా రాస్తే సమయం వృథా అవుతుంది. అందుకే ప్రశ్నకు ఉన్న మార్కులను ఆధారంగా చేసుకుని సమాధానం రాయాలి.అక్షర దోషాలు లేకుండా రాయాలి. పదాలు ఓర్పుగా, స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలి. కొట్టివేతలు లేకుండా రాయడానికి ప్రయత్నించాలి. స్పష్టంగా రాస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
పేపర్ రాసిన తర్వాత చివరి పదిహేను నిమిషాలు సమాధాన పత్రాన్ని మరోసారి చదివి సరిచూసుకోవాలి. రాసిన ప్రశ్నాపత్రం గురించి స్నేహితులతో ఎట్టి పరిస్థితుల్లో చర్చ చేయకండి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని తరువాతి పరీక్షకు సిద్ధం అవ్వండి.మీరు గత సంవత్సరం నుంచి చదువుతున్న విషయాలే ఇవి కాబట్టి అనవసరమైన ఆలోచనలు చేయకుండా ధైర్యంగా పరీక్ష రాసి విజయాన్ని సాధించండి.