జనం న్యూస్ మార్చి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
“నేను బాగున్నాను, నాకు ఎలాంటి సమస్య లేదు” అని భావిస్తూ ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ సూచించారు.హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో స్థానిక కాంగ్రెస్ నాయకుడు మందలపు సాయిబాబా చౌదరి ఆధ్వర్యంలో కేపీహెచ్బీ కాలనీ వసంత నగర్లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ పరీక్షా శిబిరాన్ని రమేష్ శనివారం ప్రారంభించారు.
ఈ శిబిరానికి స్థానిక ప్రజలు విశేషంగా స్పందించారు. మొదటి రెండు రోజులలోనే వందల సంఖ్యలో మహిళలు, పురుషులు క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ పరీక్షా శిబిరం ఆదివారం కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్సలు పొందవచ్చని అన్నారు. దీంతో మనిషి దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించగలడని తెలిపారు.అలాగే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది రోగులకు చికిత్సలు అందిస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నదని కొనియాడారు. సంచార వైద్యశాలల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తూ ముందుగానే రోగులను గుర్తించి అవసరమైన చికిత్సలు అందిస్తున్నారని పేర్కొన్నారు.బసవతారకం ఆసుపత్రికి చెందిన వైద్యులు మాట్లాడుతూ, ముఖ్యంగా మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వెంటనే ఫలితాలు వెల్లడిస్తూ అవసరమైన వారికి తగిన సూచనలు, సలహాలు మరియు చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గంధం రాజు, కొప్పిశెట్టి దినేష్ కుమార్, గాదే శివా చౌదరి, భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.



