ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం
జనం న్యూస్-మార్చి 16- నాగార్జునసాగర్ టౌన్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఏడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ కు ఏడు నెలల పెండింగ్ వేతనాలను తమకు ఇప్పించాలని వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి ఎండి సలీం సహాయ కార్యదర్శి ఎస్కె బషీర్ లక్కపాక రాజుల ఆధ్వర్యంలో నందికొండ మున్సిపాలిటీ కార్యాలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే42 మంది కార్మికులు గత ఏడు నెలలుగా వేతనాలు అందక తాము అనుభవిస్తున్న కష్టాల గురించి జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. నెలవారి జీతాలపై ఆధారపడే తమకు ఒక్క నెల జీతం ఆలస్యమైన ఇంటి అద్దె, కరెంటు బిల్లులు కట్టడానికి, నిత్యవసరాల కొనుగోలుకు అప్పులు చేయవలసి వస్తుందని ఈ సందర్భంగా వారు కలెక్టర్ చంద్రశేఖర్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తక్షణమే స్పందించి నందికొండ మున్సిపాలిటీ సిబ్బందికి వేతనాలు చెల్లింపు అయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ నందికొండ మున్సిపాలిటీ అధ్యక్షులు చౌడపల్లి శివ, ఉపాధ్యక్షులు బత్తుల భాస్కర్, కమిటీ సభ్యులు వెంకటమ్మ, సుగుణ, కవిత,రాయ లక్ష్మి, తదితరులు ఉన్నారు.


