Listen to this article

జనం న్యూస్ మార్చి 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ బీజేపీ నేతలు మరోసారి ఆందోళన బాట పట్టారు. వివేకానంద నగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రేపన్ రాజు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు సంక్షేమ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే రెండున్నర సంవత్సరాలు గడిచినా వాటి అమలులో ఎలాంటి పురోగతి కనిపించడంలేదని నేతలు ఆరోపించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లు, గృహలక్ష్మి పథకం ద్వారా మహిళలకు రూ.2,500 ఆర్థిక సహాయం, నిరుద్యోగులకు భృతి, వృద్ధులకు రూ.4,000 పెన్షన్ వంటి కీలక హామీలు ఇప్పటికీ అమలులోకి రాలేదని విమర్శించారు.రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, వెంటనే హామీలను అమలు చేయాలని తహసీల్దార్‌కు సమర్పించిన వినతిపత్రంలో డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యురాలు జయశ్రీ, డివిజన్ ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, పార్టీ సీనియర్ నేత భాస్కర్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి వడ్ల బ్రహ్మచారి, బీజేవైఎం అధ్యక్షుడు సుంకరి సాయి, దేవేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, హామీలు అమలు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.