Listen to this article

జనం న్యూస్ మార్చి 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన రహదారులను గేట్లు ఏర్పాటు చేసి మూసివేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. శిల్పా బృందావనం, సాయి హిల్స్ నివాసులు రహదారిని ఆక్రమించి గేటెడ్ కమ్యూనిటీ పేరుతో ప్రజల రాకపోకలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ప్రగతి నగర్‌లో ప్రణీత్ ఆంటీలియా తరహాలోనే ఇక్కడ కూడా రోడ్లను మూసివేస్తున్నారని స్థానికులు విమర్శించారు. ముఖ్యంగా శనివారం, ఆదివారం రోజుల్లో శాంషీగూడ నుంచి ఎల్లమ్మబండకు వెళ్లడానికి సుమారు రెండు గంటల సమయం పడుతోందని, దీనివల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శిల్పా బృందావనం కాలనీ మొత్తం హెచ్ఎండిఏ లేఔట్ ప్రకారం అభివృద్ధి చేయబడినా, గేట్లు ఏర్పాటు చేసి ప్రజలకు రాకపోకలను నిరోధించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సాయి హిల్స్ ప్రాంతంలో రోడ్డు మీద గోడ నిర్మాణం చేపట్టిన విషయంపై ఇప్పటికే డిప్యూటీ కమిషనర్‌లు, ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.
ఈ సమస్యపై స్పీకింగ్ ఆర్డర్లు ఉన్నప్పటికీ అమలు జరగకపోవడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు స్థలంలో మార్పు లేకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది.జిహెచ్ఎంసి అధికారులు తక్షణమే స్పందించి రహదారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ రహదారి తెరవబడితే మియాపూర్ నుంచి గాజులరామారం వరకు నేరుగా రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. ఇక శిల్పా బృందావనం పరిధిలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన ఆలయానికి భక్తులను అనుమతించకుండా అడ్డుకుంటున్నారనే ఆరోపణలు కూడా వెలుగుచూశాయి. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ధర్మకర్తగా వ్యవహరిస్తూ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాడని స్థానికులు పేర్కొన్నారు. అంతేకాకుండా, కాలనీలో ఉన్న పార్కును అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులో ఉంచాలని కోరారు.గేట్ల వెనుక జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, ప్రజల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో దార్గుపల్లి గోపాల్, దార్గుపల్లి సురేందర్, సుధాకర్, ప్రభాకర్, శ్యామ్ రావు, లింగం, కె. సత్యనారాయణ, భీమ్ రావు, గణేష్, కృష్ణ, జె. ప్రభాకర్, ఎం. దర్శన్, డి. ప్రభాకర్, ఎం. రమేష్, కె. పోచయ్య, జె. కిరణ్, కె. రవి తదితరులు పాల్గొన్నారు