జనం న్యూస్ మార్చి 21: నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలంలోని గోదావరి నది తీరాన గల తడపాకల్ శ్రీ దత్త సాయి మందిర పంచమ వార్షికోత్సవం సందర్భంగా ఆశ్రమాలయ వ్యవస్థాపకులు నిర్గుణ తత్వ మహారాజు ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక విజ్ఞాన మహాసభలు ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ మహాసభల్లో భాగంగా రెండవ రోజు శనివారం సామూహిక భజనలు నిర్వహించి, అనంతరం సత్సంగం జరిగింది. తరువాత మోర్తాడ్‌కు చెందిన దయానంద ఆర్య యజ్ఞం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన వక్తలుగా విచ్చేసిన శ్రీధరానంద భారతి స్వామి, వేద పునీతానంద భారతి స్వామి మాట్లాడుతూ—స్త్రీ జీవితం కేవలం కుటుంబ బాధ్యతలకే పరిమితం కాదని తెలిపారు. ఆధ్యాత్మికత, గృహస్థ జీవితం, సమాజంలో స్థానం—ఈ మూడు సమన్వయమే ఆమె జీవన సార్ధకతను నిర్ణయిస్తాయని వివరించారు.స్త్రీ జీవితంలో ఆధ్యాత్మికతకు అత్యంత ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, వ్రతాలు మాత్రమే కాకుండా మనసు శుద్ధి, ధర్మబద్ధమైన ఆలోచనలు, సహనం, ప్రేమ, సేవాభావం వంటి విలువలను పెంపొందించుకోవడమని తెలిపారు.స్త్రీ ఆధ్యాత్మికతను ఆచరించినప్పుడు కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయని, తల్లి రూపంలో పిల్లలకు మంచి విలువలు నేర్పగలదని వారు పేర్కొన్నారు.



