జనం న్యూస్ ;24 మార్చ్ మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;
కథారచనలో సిద్దిపేట స్వయంప్రతిపత్తి ప్రభుత్వ డిగ్రీకళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో బహుమతులు సాధించడం కళాశాలకు గర్వకారణం అని ప్రిన్సిపల్ ఆచార్య జి. సునీత అన్నారు. రోజురోజుకూ జీవితం యాంత్రికంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో యువతరం సృజనరంగంలో చొరవచూపటం ఆనందంగా ఉందని, మానవీయతను సహానుభూతిని ప్లకటించుటలో సాహిత్యం చేసే సేవ గొప్పదని, సాహిత్యరంగంలో రాణించటం ఆనందదాయకం అని విద్యార్థులను అభినందించారు.
కళాశాల తెలుగుశాఖ అధ్యక్షులు, భాషాసంస్కృతిక విభాగం కన్వీనరు ఆచార్య మట్టా సంపత్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ సమాజసేవకులు మణికొండ వేదకుమార్ ఆధ్వర్యంలో బాలచెలిమి మాసపత్రిక, చిల్డ్రన్అస్ ఎడ్యుకేషన్ ట్రస్టు సంయుక్తంగా జాతీయస్థాయిలో నిర్వహించిన బాలలకోసం కథారచన పోటీలో కళాశాల నుంచి పదమూడుమంది యువరచయితలు పాల్గొన్నారని, వీరి రచనల స్ఫూర్తితోనే న్యాయ నిర్ణేతలు యువతరం రాసిన బాలల కథలు అనే కొత్త కేటగిరీ ఆరంభించారని, ఈ కేటగిరీలో చెట్టు ఉపకారం కథతో కట్టోజు నీరజ జాతీయ స్థాయిలో మొదటి బహుమతి గెలుచుకున్నదని తెలిపారు. విజేత నీరజ కథతోబాటు మిగతా విద్యార్థుల పన్నెండు కథలూ, మరికొందరు విద్యార్థుల కథలు కలిపి ఐ ఎస్ బి ఎన్ నంబరుతో నిర్వాహకులు కథాసంకలనం ముద్రించారని బాలల కథారచనపోటీలలో యువతరం కథలకు ఇదొక నూతన అధ్యాయమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా బాలచెలిమి సంపాదకులు వేదకుమార్, కథలపోటీ కన్వీనరు గరిపల్లి అశోక్ గార్లకు కళాశాల తరపున ధన్యవాదాలు తెలిపారు.కథాసంకలనంలో మొత్తం ఇరువై ఎనిమిది కథలుంటే వాటిలో పదమూడు కథలు సిద్దిపేట స్వయంప్రతిపత్తి డిగ్రీకళాశాలవే కావడం ముదావహం. పిల్లిట్ల భార్గవి (వర్షాలు లేని ఊరు), నరిగె రమ్య (నిజమైన మిత్రుడు), బొమ్మెన కోమల (తొందరపాటు), కొండజ్యోతి(చదువు), దమ్మ స్పందన (వారసత్వం), కట్టోజు నీరజ (చెట్టు ఉపకారం), బొల్లు అఖిల(అన్నీ గొప్పవే), ఉప్పు భవాని(చిన్ని), కొత్తపల్లి వైష్ణవి (స్నేహమే బహుమతి), ఎర్ర చంద్రశేఖర్ (అన్వి మారిన రోజు), కొమ్మట భార్గవి(దుర్వ్యసనాలకు దూరం), తమ్మనబోయిన రిబ్కా(కనువిప్పు),కావేరి హరికృష్ణ(సెలవుల స్నేహం) కథలు సంకలనంలో స్థానం సంపాదించాయి.ఈ కథారచయితల అభినందన కార్యక్రమంలో తెలుగుశాఖ అధ్యాపకులు పిట్ల దాసు, నారోజు వెంకటరమణ, నరేశ్, రామస్వామి, శైలజ, సాయిసురేశ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.


