జనం న్యూస్ | మార్చి 26 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తలతో ప్రజల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో, అలాంటి భయాలకు తావులేదని కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు గాదె శివ స్పష్టంచేశారు. దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, కనీసం వచ్చే ఆరు నెలలకు సరిపడా నిల్వలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.ప్రపంచంలోని కొన్ని ఇంధన ఉత్పత్తి దేశాల్లో యుద్ధ పరిస్థితులు నెలకొనడం వల్ల గ్లోబల్ స్థాయిలో సరఫరాపై ప్రభావం పడుతున్నప్పటికీ, భారతదేశం మాత్రం ఇంధన రంగంలో స్థిరత్వాన్ని కొనసాగిస్తోందని గాదె శివ పేర్కొన్నారు. దేశంలో ఉన్న శక్తివంతమైన రిఫైనరీలు, అలాగే రష్యా వంటి దేశాల నుంచి కొనసాగుతున్న క్రూడ్ ఆయిల్ దిగుమతుల వల్ల పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని ఆయన వివరించారు.ఇటీవల కొన్ని ప్రాంతాల్లో తాత్కాలికంగా కనిపిస్తున్న కొరతకు అసలు కారణం సరఫరా లోపం కాదని, ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో ప్రజలు పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి దేశంలో ఇంధన కొరత లేదని మరోసారి ఆయన నొక్కిచెప్పారు.అయితే గ్యాస్ సరఫరా విషయంలో కొంత మేర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని గాదె శివ తెలిపారు. దేశీయ ఉత్పత్తి అవసరాలకు పూర్తిగా సరిపోకపోవడం వల్ల గ్యాస్ కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పారు.ఇంధన వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గాదె శివ సూచించారు.
గ్యాస్ వినియోగాన్ని అవసరమైన మేరకే పరిమితం చేయాలని, ఇండక్షన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ పొయ్యిల వినియోగాన్ని పెంచాలని సూచించారు. వ్యాపార సంస్థలు కూడా విద్యుత్ ఆధారిత వంట విధానాలను అవలంబించాలని పిలుపునిచ్చారు.వాహన వినియోగంపై మాట్లాడుతూ, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వ్యక్తిగత వాహనాలను ఉపయోగించాలని, సాధ్యమైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలు అయిన ఆర్టీసీ బస్సులు, రైళ్లను వినియోగించాలని కోరారు. భవిష్యత్ దృష్ట్యా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్పు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.రాబోయే నెలల్లో ప్రతి ఒక్కరూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే ఇంధన వినియోగాన్ని నియంత్రించవచ్చని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని గాదె శివ విజ్ఞప్తి చేశారు.


