భారతదేశ ఐక్యతను ప్రతిబింబిస్తూ, దేశంలోని విభిన్న సంస్కృతులను పరిచయం చేసే విధంగా PMSHRI కార్యక్రమంలో భాగంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం జడ్పీహెచ్ఎస్ ఏర్గట్లలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హింది ఉపాధ్యాయురాలు డి. సమిత ఆధ్వర్యంలో అట్టహాసంగా చేపట్టారు.కార్యక్రమంలో భాగంగా హర్యానా, తెలంగాణ రాష్ట్రాల సాంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు విద్యార్థులు వివిధ ప్రదర్శనలు చేశారు. అన్ని రాష్ట్రాల సంప్రదాయ వస్త్రధారణలో బాలికలు ఆకట్టుకున్నారు. విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబిస్తూ వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అలాగే విద్యార్థులు గీసిన చార్టులు భారతదేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలను ప్రతిబింబించాయి.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ, ప్రపంచంలో తొలి నాగరికత వెలసిన దేశం భారతదేశమని, వేల సంవత్సరాలుగా దేశం ఐక్యంగా కొనసాగడానికి ఇక్కడి ప్రజలే ప్రధాన కారణమని తెలిపారు. దేశంలో వందలాది భాషలు, అనేక మతాలు, సంస్కృతులు ఉన్నప్పటికీ ప్రజలు ఐక్యంగా జీవించడం భారతదేశ గొప్పతనమని పేర్కొన్నారు.కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కూడా నిర్వహించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలను తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులకు విక్రయించారు. తెలంగాణ మరియు హర్యానా రాష్ట్రాలకు చెందిన వంటకాలు ఈ ఫుడ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాదు, రాజశేఖర్, ఎస్. శ్రీనివాస్, రాజేందర్, రాజనర్సయ్య, గంగాధర్ జ్యోతి, ట్వింకిల్ కుమార్, నరేష్, గంగమోహన్, కోమలి, కృష్ణవేణి మరియు రిషిత పాల్గొన్నారు.




