జనం న్యూస్ | మార్చి 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్‌పల్లి ప్రాంతంలోని శ్రీ చిత్తారమ్మ దేవస్థానంలో భక్తి పారవశ్యాన్ని కలిగించే విధంగా శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ లక్ష్మీ అమ్మవారి తీరునక్షత్ర పుట్టినరోజు సందర్భంగా విశ్వ శ్రేయస్సు కోరి ఈ మహా యాగాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఏప్రిల్ ఒకటో తేదీ బుధవారం సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు యాగం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్చారణల మధ్య యాగం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, సమాజ శాంతి, సుభిక్షం కోసం ఈ యాగాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులందరూ కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ భూ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య అనుగ్రహం పొందాలని కోరారు.
అదేవిధంగా యాగం నిర్వహణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, కార్యక్రమానికి విచ్చేసే భక్తులకు వివిధ రకాల ప్రసాదాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పాంప్లెట్‌ను విడుదల చేశారు. భక్తి, సంప్రదాయం కలయికగా జరగనున్న ఈ మహా కార్యక్రమానికి కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల భక్తులు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.



