జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ సలికినీడి నాగు ఏప్రిల్ 1 సెల్ 9550978955
చిలకలూరిపేట: పట్టణ అభివృద్ధిలో కీలకమైన ఆస్తి పన్ను వసూళ్లలో చిలకలూరిపేట పురపాలక సంఘం ఈ ఏడాది ఆశాజనకమైన ఫలితాలను సాధించింది. మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరి బాబు ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు ₹10.40 కోట్లు వసూలు కాగా, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ₹53 లక్షలు అధికం కావడం విశేషం. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నిధుల సమీకరణే లక్ష్యంగా, పౌర సేవలను మరింత మెరుగుపరిచేందుకు అధికారులు పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు.మొబైల్ కౌంటర్లకు విశేష స్పందన పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యంగా ఉండేందుకు ప్రవేశపెట్టిన మొబైల్ కౌంటర్ వాహనాలు వసూళ్లలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సుమారు ₹35 నుండి ₹40 లక్షల వరకు పన్ను కేవలం ఈ మొబైల్ కౌంటర్ల ద్వారానే వసూలు కావడం విశేషం. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా, నేరుగా తమ ఇంటి వద్దకే వచ్చే వాహనం వద్ద పన్ను చెల్లించి వెంటనే రిసీప్ట్ పొందే వెసులుబాటు కల్పించారు. ఎండను సైతం లెక్కచేయకుండా రెవిన్యూ విభాగం సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు.అధికారుల సమన్వయం ఈ వసూళ్ల ప్రక్రియలో రెవిన్యూ ఆఫీసర్ సుబ్బారావు, ఆర్.ఐ లు గిరిబాబు, అబ్దుల్ ఖాదర్ లు సమన్వయంతో వ్యవహరిస్తూ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో మెరుగైన మౌలిక సదుపాయాలు అందాలంటే ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా వసూళ్లను వేగవంతం చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.


