Listen to this article
  • పశ్చిమప్రాంతాన్ని చుట్టివచ్చిన ఎస్పీ
  • ఆయన దృష్టికి అనేక సమస్యలు
  • సత్వరమే కేసులు నమోదు చేయించిన వైనం
  • నేడు నేర సమీక్షా సమావేశం

ఇటీవల ఒంగోలు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ను గుంటూరు రేంజి ఐజీ తనిఖీ చేశారు. ఆ సమయంలో కొన్ని సీడీ ఫైళ్లలో కేవలం ఎఫ్‌ఐఆర్‌ మాత్రమే ఉండటాన్ని చూసి ఆయన ప్రశ్నించారు. ఎస్పీ గ్రీవెన్స్‌ నుంచి వచ్చిన అర్జీలను కూడా పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 10 రోజులుగా జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లను ఎస్పీ దామోదర్‌ తనిఖీలు చేశారు. స్థానికంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తూ కొన్నిచోట్ల అధికారులను మందలించారు. ఆయన ఆదేశాల మేరకు అప్పటికప్పుడు కొన్ని కేసులు నమోదు చేశారు. పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా కిందిస్థాయి అధికారుల తీరు మారడం లేదు. ఆదాయమే పరమావధిగా విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా సామాన్యులకు సత్వర న్యాయం అందడం లేదు. అందుకు తాజాగా ముఖ్యమంత్రి ఇచ్చిన గ్రేడింగే నిదర్శనం. ఫైళ్ల పరిష్కారంలో పోలీసు శాఖ 18వ స్థానంలో ఉంది. అదే పరిస్థితి జిల్లాలోనూ కొనసాగుతోంది. స్టేషన్లలో కేసుల నమోదు నుంచి దర్యాప్తులు, పరిష్కారాలు అన్నీ మందకొడిగానే సాగు తున్నాయి. తాజాగా ఐజీ ఆదేశాలు, ఎస్పీ తనిఖీలతోనైనా పోలీసు శాఖ గాడిన పడుతుందా.. అనేది చర్చనీయాంశంగా మారింది. ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ రామిరెడ్డి, ఒంగోలు క్రైం, ఫిబ్రవరి 13 (జనం న్యూస్): పోలీసు శాఖలో జవాబుదారీతనం, పారదర్శకత పెరగాలని ఉన్నతాధికారులు ఆదేశాలిస్తున్నా.. కిందిస్థాయి అధికా రులు మాత్రం మారడం లేదు. మేమింతే అంటూ ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. పాత కేసులకు సంబంధించిన సీడీ ఫైళ్లలో దర్యాప్తునకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేకపోవడం చూస్తే పోలీసు స్టేషన్లలో నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో అర్థమవుతుంది. నాలుగురోజులపాటు జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్‌లను ఎస్పీ దామోదర్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అనేక మంది బాధితులు ఆయన్ను కలిశారు. కొంతమంది చిన్నచిన్న విషయాలపై స్టేషన్‌కు వచ్చినా తమను పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దొంగత నాల కేసులు నమోదు చేయకుండా తిప్పుకోవ డం, సెల్‌ఫోన్‌, మోటర్‌సైకిల్‌ చోరీల విషయంలో ఇన్సూరెన్స్‌ ఉందా.. లేకుంటే బైక్‌ దొరికినప్పుడు కేసులు నమోదుచేస్తామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైబర్‌ నేరాలు జరిగితే తాము చేయగలిగింది ఏముందని చేతులెత్తేస్తున్నా రని ఆరోపించారు. ఇలాగైతే తమకు సత్వర న్యాయం ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేస్తే గాని అరాచకవాదికి అడ్డుకట్ట వేయలేదు పుల్లలచెరువు మండలం సిద్దన్నపాలెంనకు చెందిన గడ్డం సుబ్బయ్య వైసీపీ నేత. గత ప్రభుత్వ హయాంలో స్థానిక మంత్రి అండదండలతో చెలరేగిపోయాడు. గ్రామంలో ఉండా లంటే రూ.10లక్షలు ఇవ్వాలని ముగ్గురు అన్నదమ్ములను బెదిరించాడు. అదేమి టని ప్రశ్నిస్తే వారిపై దాడి చేశాడు. అప్పట్లో పోలీసు స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకున్న వారు లేరు. దీంతో బాధితులు ఊరు విడిచి వెళ్లిపోయారు. అంతేకాదు సిద్దన్నపాలెం గ్రామాన్ని తన పేరు మీద ఆన్‌లైన్‌ చేసుకొని బ్యాంక్‌లో తాకట్టుపెట్టాడు. ఇలాంటి ఘనచరిత్ర కలిగిన సుబ్బయ్యపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. మూడు రోజుల క్రితం ఎస్పీ పోలీసు స్టేషన్‌ తనిఖీకి వచ్చినప్పుడు భాధితులు ఫిర్యాదు చేయగా ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి వైసీపీ నేతను అరెస్టు చేశారు బాధితులపైనే కేసు నమోదు ఒంగోలు నగరంలోని కేశవరాజుకుంటలో ఓ బాలిక ను కొందరు వేధింపులకు గురిచేశారు. వారిపై బాలిక తల్లి, అన్న తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు. టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ తనిఖీకి వచ్చిన గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్టి త్రిపాఠీని బాధితులు కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. అదేసమయంలో బాధితురాలు తల్లి, అన్నతోపాటు దళిత నాయకులపై ఆ కేసులో నిందితులుగా ఉన్న వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. కేసుల నమోదులో జాప్యం న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో పోలీసు స్టేషన్‌కు వచ్చే బాధితుల గోడు వినేందుకు, సత్వరమే స్పందించేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా దొంగతనాలకు సంబంధించిన కేసులు నమోదు చేయడం లేదు. సెల్‌ఫోన్‌ పోయింది అని వస్తే దొరికినప్పుడు ఇస్తామని చెప్పి పంపిస్తున్నారు. మోటర్‌ సైకిల్‌ చోరీకి గురైందని పోలీసు స్టేషన్‌కు వెళ్లినా ప్రయోజనం ఉండటం లేదు. ఎక్కడైనా దొరికితే చూద్దాంలే అని చెబుతున్నారు. కొన్ని కేసులలో స్థానిక నాయకుల నుంచి వచ్చే సమాచారం కోసం పోలీసులు వేచిచూస్తున్న పరిస్థితి. సిట్‌ కేసులలో దర్యాప్తు నత్తనడక జిల్లాలో భూవివాదాలపై వేసిన సిట్‌లో నమోదైన కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. కొన్ని కేసులలో అసలు విచారణ చేయడం లేదు. కేవలం ఎఫ్‌ఐఆర్‌ మాత్రమే కట్టి వదిలి వేశారు. భూవివాదాలు ఏమాత్రం పరిష్కారం కాకుండా ఉండటంతో భాధితులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు దాటినా కేసుల విషయాన్ని సిట్‌ పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ కేసులు దర్యాప్తు ముమ్మరం చేసి భరోసా కల్పించాలని వారు కోరుతున్నారు. ఐటీ కోర్‌ సీఐపైనే కేసు నమోదు : ప్రస్తుతం జిల్లాలో ఐటీ కోర్‌లో సీఐగా పనిచేస్తున్న సూర్యనారాయణపై పల్నాడు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో చిలకలూరిపేట సీఐగా పనిచేశారు. అప్పటి మంత్రి విడదల రజని ఏమి చెబితే అది చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సోషల్‌ మీడియాలో రజనిపై పోస్టింగ్‌లు పెట్టినట్లు తనపై సూర్యనారాయణ నేరం మోపి అక్రమంగా నిర్భంధించి కొన్నిరోజులపాటు వేధింపులకు గురిచేశారని ఓ దళిత యువకుడు ఫిర్యాదు చేయడంతో రజనితోపాటు సీఐపై కూడా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నేడు నేర సమీక్షా సమావేశం జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఎస్పీ నేర సమీక్ష చేయనున్నారు. జిల్లాలోని పోలీసు అధికారులంతా హాజరుకానున్నారు.ఈ సమావేశంలో పెండింగ్‌ కేసులపై సమీక్ష చేస్తారు. సైబర్‌ నేరాలు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలపై సమీక్ష చేయనున్నారు.