.జనంన్యూస్. 08.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
సిరికొండ మండల కేంద్రంలోని పీ యం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల& కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి స్థానిక హెడ్ కానిస్టేబుల్ శంకర్ హాజరై విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు, వాటి ప్రాముఖ్యతపై తెలియజేశారు.రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం,హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పాటించకపోవడం వంటి కారణాల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు.ముఖ్యంగా విద్యార్థులు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.అదేవిధంగా, మైనర్ వాహనాలు నడిపించడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు.ఇటువంటి సందర్భాలలో విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలియజేశారు.తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దని వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలు కేవలం వ్యక్తిగత నష్టం మాత్రమే కాకుండా కుటుంబాలకు, సమాజానికి పెద్ద నష్టం కలిగిస్తాయని పోలీసులు పేర్కొన్నారు.అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రభుత్వం జారీ చేసే లైసెన్స్ పొందాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు సురక్షితంగా ఉండాలంటే రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే సరైన అలవాట్లు అలవరచుకోవడం చాలా ముఖ్యమని, ట్రాఫిక్ నియమాలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి, కానిస్టేబుల్స్ మధుకర్ ,జీవన్ ,నరేష్ ,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



